ప్రపంచంలో తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది. అక్రమార్కులు పేట్రేగిపో తున్నారు. లంచగొండితనం రాజ్యమేలుతున్నది. ఆకలి కన్నా తీవ్రమైన సమస్యగా అవినీతి నిలబడివున్నది. లంచం ఇవ్వనిదే ఫైలు కదలనంటున్నది. ఆమ్యామ్యాల మేతతో అక్రమార్కులు బలిసిపోతున్నారు.అక్రమార్జనలే నవ్య నాగరికత అవుతున్నది. అధికారం అవినీతికి రాచబాట అయింది. కీచక రాజకీయ నాయకుల ఆదేశాలే అలిఖిత చట్టాలు అయ్యాయి. నీతిమంతుడు చేతకాని వాడుగా పరిగణించబడుతున్నాడు. అవినీతి, లంచగొండితనం అనేవి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలుగా అవతరించాయి. అవినీతి రహిత సమాజ స్థాపనకు పూనుకోవడం, మూలాలను అన్వేషించడం, అక్రమార్కులను శిక్షించడం, చట్టాలను రూపొందించి కఠినంగా అమలుపరచడం లాంటి పలు అంశాలను చర్చించే ఐరాస వేదికగా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని ప్రతి ఏటా పాటించుట ఆనవాయితీగా మారింది.ఐరాస గణాంకాల ప్రకారం ప్రతి ఏటా 1 ట్రిలియన్ డాలర్లు అవినీతిపరుల జేబులో చేరుతున్నది. 2.6 ట్రిలియన్ డాలర్లు అక్రమ మార్గంలో తరలిపోతున్నది. ప్రపంచ జిడిపిలో 5 శాతం వరకు అవినీతిపరుల చేతులు మారుతున్నది. మానవాళి సమగ్రాభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న అవినీతి అంతానికి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతగల పౌరులు, ప్రైవేట్ సంస్థలు తమ వంతు చేయూతను ఇవ్వాలి. అవినీతి పెరిగితే పేదరికం, అశాంతి, హింస, ఆర్థిక మందగమనం, నేర ప్రవృత్తి, ఆకలి చావులు, ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతాయని చరిత్ర బోధిస్తున్నది. నేర చరితులే నవ నాయకులుగా అవతారమెత్తుతున్నారు.అవినీతితో ప్రజాస్వామ్యం పరిహసించబడడం, ప్రభుత్వాలు అస్థిరత్వం పాలు కావడం, దేశ ప్రగతి తిరోగమన దిశగా కదలడం జరుగుతాయి. చట్టాల లొసుగుల్ని గమనించడం, రంధ్రాన్వేషణ చేయడం, అధికారంతో రక్షణ పొందడం, పౌరుల అవసరాలను అలుసుగా తీసుకోవడం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, లంచం తీసుకోవడం, భావ కాలుష్యం లాంటివి. అవినీతి దురాచారాలుగానే పరిగణించబడతాయి. అవినీతి, అధికార దుర్వినియోగాలు వ్యక్తి స్వేచ్ఛ, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వ పాలన, సమాజ భవిష్యత్తులకు విఘాతంగా మారుతున్నాయి.ప్రపంచ దేశాల్లో అవినీతిని కొలువడానికి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సిపిఐ) సూచిక ద్వారా నిర్ణయించి పోలుస్తారు. సిపిఐ 100 వున్న దేశాన్ని అవినీతి రహిత దేశంగా, 0 ఉన్న దేశాన్ని అత్యంత అవినీతి కలిగిన దేశంగా వర్గీకరిస్తారు. సిపిఐ వివరాల ప్రకారం డెన్మార్క్ (సిపిఐ 88), న్యూజీలాండ్ (88), ఫిన్లాండ్ (88), సింగపూర్ (85), స్వీడెన్ (85), నార్వే (85), స్విస్ (84), నెదర్లాండ్ (82), జర్మనీ (80)లు అవినీతి అతి తక్కువగా వున్న దేశాలుగా తొలి 10 స్థానాలను దక్కించుకున్నాయి. అవినీతి అధికంగా ఉన్న దేశాలుగా ఇండియా (40), శ్రీలంక (37), నేపాల్ (33), పాకిస్థాన్ (28)లతో పాటు అత్యంత అవినీతి కలిగిన దేశాలుగా దక్షిణ సూడాన్ (సిపిఐ 11), సిరియా (13), సొమాలియా (13), వెనుజులా (14), నార్త్ కొరియా (16), అఫ్ఘానిస్థాన్ (16), లిబియా (17) దేశాలు జాబితాలో చివరన వున్నాయి. మె?త్రం 180 ప్రపంచ దేశాల జాబితాలో సిపిఐ జాబితాలో ఇండియాకు 85వ స్థానం లభించింది.అవినీతి, లంచగొండితనం అధికంగా వ్యాపించిన భారతంలో నీతివంతమైన సమాజం మాయమైపోయింది. దేశ ప్రగతి నిరోధకంగా అవినీతి చెదలు నిలుస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న అధిక జనాభా, నిరుద్యోగం, అవిద్య, వాతావరణ కాలుష్యం, పేదరికం లాంటి సమస్యలకు అవినీతి కారణం అవుతున్నది. పోలీసు, రెవెన్యూ శాఖల్లో అవినీతి అనకొండలు బుసకొడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు బడుగులకు చేరే సరికి సన్నబడుతున్నాయి. అక్రమార్కులను పట్టుకోవడం, లంచాల ఎర చూపి బయటపడడం సర్వసాధారణం అయింది. అవినీతి వ్యతిరేక చట్టాలు మూలనపడి మూలుగుతున్నాయి. అధికారి నుంచి బంట్రోతు వరకు, వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అందరికీ అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. చేతులు తడపందే ఫైలు కదలనంటోంది. తూకంలో మోసాలు, నకిలీ సామాన్లు, పన్ను ఎగవేతలు, కల్తీ లీలలు, ఆన్లైన్ మోసాలు లాంటివి సామాజిక ఆరోగ్యానికి పట్టిన తెగులుగా అవతరించాయి.నేర చరిత్రలే రాజకీయ నాయకుల అర్హతలు అయ్యాయి. భారత పార్లమెంటులో 50% వరకు ఎంపిలు నేరఆరోపణలు కలిగి వున్నారని, 40 మంది ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. దేశ వ్యాప్తంగా ఎంఎల్ఎలు 4,442 కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఏకమవుతూ పోరు బాట పడదాం. నైతికత, పారదర్శకత, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం, జవాబుదారీతనం, అంకిత భావం పెరగాలి. నీతివంతమైన భారత నిర్మాణానికి మనందరం పూనుకుందాం, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతిన బూనుదాం.