అమరావతి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను జగన్‌ తుంగలో తొక్కడంతోనే ప్రజలు వైకాపాను గొయ్యి తీసి పాతిపెట్టారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ‘వైకాపా ప్రభుత్వం వైఎస్‌ మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించింది. ఆయనకు ఇష్టమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో రూ.4వేల కోట్లు బకాయిలు పెండింగులో ఉంచింది. చిక్కీలు, కోడిగుడ్లు, ఆఖరికి యూనిఫాంలకు కూడా డబ్బులు చెల్లించలేదు. వైకాపా నాయకులు హత్యారాజకీయాలు, గూండాయిజం చేసి ఉండొచ్చు. దానిని కాదనట్లేదు. కానీ దానికీ వైఎస్‌కు ఏం సంబంధం? ఆయన విగ్రహాలను ధ్వసం చేయడం న్యాయమా?’ అని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ విగ్రహాలను ధ్వసం చేస్తే అక్కడికెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘రాజశేఖరరెడ్డికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఇష్టమైన ప్రాజెక్టని తెలిసి కూడా అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ ఆ సంస్థని కాపాడటానికి ప్రయత్నించలేదు. పైగా అది నష్టాల్లో ఉందా అని తెలియనట్లు అడిగారు’ అని మండిపడ్డారు. ‘వైకాపా తోకపార్టీ. భాజపాకు ఊడిగం చేసి, ప్రతి బిల్లుకూ మద్దతిచ్చింది. భాజపాకు సంబంధించిన వ్యాపారులు, నాయకులకు రాజ్యసభ.. తితిదేలో.. ఏది అడిగితే ఆ పదవులు ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును వైకాపా తాకట్టుపెట్టింది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలోనూ జగన్‌ భాజపాకు మద్దతిచ్చారు. మణిపుర్‌ ఘటనతో సహా ఏది చూసినా జగన్‌ భాజపాతోనే ఉన్నారు. భాజపాకు తొత్తుగా, తోకపార్టీగా ఉన్నది వైకాపానే’ అని షర్మిల ధ్వజమెత్తారు. తెదేపాకు కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *