ఒక చేతితో చప్పట్లు కొట్టలేనట్లే.. బలమైన, నమ్మకమైన విపక్షం లేనప్పుడు దానిని ప్రజాస్వామ్య దేశంగా నమ్మలేం. సర్కారు నిరంకుశ పోకడల నివారణకు గట్టి ప్రతిపక్షం ఉండి తీరాల్సిందే’ అన్నారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో మన పార్లమెంటులో కమలం పార్టీ విజృంభణ కారణంగా బలమైన విపక్షం లేకుండా పోయింది. ఈ కారణంగా గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అనేక ఏకపక్ష నిర్ణయాలను తీసుకుని ప్రజాస్వామ్య భావనలను అపహాస్యం చేసింది. ప్రజలు అధికారం ఇచ్చిన పార్టీగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టలేని వారు సైతం.. వాటిని ప్రకటించిన తీరు, అమలు చేసిన వైనంపై తమ అసంతృప్తిని వెల్లడిరచారు. అయితే, 2024 సాధారణ ఎన్నికల్లో చలిచీమలు ఒక్కటై బలమైన సర్పాన్ని కట్టడిచేసినట్లుగా ఎన్డీయే కూటమికి ఊహించని షాక్ ఇచ్చాయి.‘జుడేగా భారత్, జీతేగా ఇండియా’ భారత్ ఒక్కటవుతుంది, ఇండియా కూటమి గెలుస్తుంది అనే నినాదంతో ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్’ (ఇండియా) ప్రజల ముందుకు వచ్చింది. కూటమి పేరు ద్వారానే ప్రజలకు ప్రతిపక్షాలు ఒక స్ఫూర్తిదాయక సందేశాన్ని పంపాయి. నియంతృత్వ రాజకీయాలు, బలహీనపడుతున్న రాజ్యాంగం, సమాఖ్య పాలనా విధానం, నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామిక హక్కులు, ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని దోషిగా చూపే ప్రయత్నాలు, సామాజిక సాధికారత, మతపరమైన మైనారిటీలు, అణగారిన వర్గాల సమస్యలు, మణిపుర్ విషాదం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతం, జాతీయ ఆస్తుల అమ్మకాలు, కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టటం, రైతుల దుస్థితి వంటి అంశాల విూద ఇండియా కూటమి ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇండియా కూటమి విజయానికి రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర, దేశంలోని మెజారిటీ ప్రాంతాల ప్రజలతో మమేకమై వారి మనసు గెలుచుకోవటమూ కలిసొచ్చింది.కూటమిలో అతిపెద్ద, బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ఎక్కడా ఆధిపత్య భావన చూపకుండా, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీల మాటకు విలువిచ్చింది. అక్కడి క్షేత్రీయ ఆకాంక్షలకు కాంగ్రెస్ అండగా నిలిచింది. గెలిచే సత్తా ఉన్న మిత్రపక్షాల కోసం నాలుగడుగులు వెనక్కి వేసింది. మునుపెన్నడూ లేనంత తక్కువగా కాంగ్రెస్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), బిహార్ (40), తమిళనాడుల్లో (39) మొత్తం 207 స్థానాలు ఉండగా.. వాటిలో కాంగ్రెస్ కేవలం 52 చోట్ల పోటీ చేసింది. అంటే కేవలం 25 శాతం స్థానాలకు పరిమితమైంది. ఈ రాష్ట్రాల్లో హస్తం పార్టీ తన మిత్రపక్షాల కోసం పెద్ద త్యాగమే చేసింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి 62, బీహార్‌లో లాలూయాదవ్ పార్టీ ఆర్జేడీకి 24, తమిళనాట డీఎంకేకు 22, మహారాష్ట్రలో శివసేన, శరద్ పవార్ పార్టీలకు 31 స్థానాలను కేటాయించింది. వీరుగాక సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, రaార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీల విషయంలోనూ ఇలాంటి ఉదారతనే చూపింది. ఈ సంయమన వ్యూహం కారణంగానే 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తన బలాన్ని రెండిరతలు పెంచుకొని 100 సీట్లు సాధించటమే గాక, ఇండియా కూటమి బలం 234కి చేరి అధికారానికి రెండు అడుగుల దూరంలో ఆగిపోయినా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదుల్లో గొప్ప ఆశను నింపగలిగింది.2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 31.34శాతం ఓట్లు సాధించిన బీజేపీ 282 సీట్లు సాధించగా, 2019 నాటికి తన బలాన్ని మరింత పెంచుకుని 37.7శాతానికి చేరి, 303 సీట్లను ఒడిసిపట్టింది. ఈ పదేళ్ల మోదీ పాలనలో కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఏకపక్ష భావన బలంగా కనిపించింది. అలాగే, పాలనలో జవాబుదారీతనం, ప్రశ్నించిన వారిని ద్రోహులుగా చిత్రీకరించే వాతావరణం కొనసాగింది. ఈ రెండు ఎన్నికల్లో కమలనాథుల విజయంలో వారు ఎంచుకున్న ఎజెండా ప్రభావం కంటే, విపక్షాల అనైక్యతే ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ఆలోచన నుంచే మొగ్గ తొడిగిన ఇండియా కూటమి, ఎన్నికల పరీక్షలోనూ నెగ్గి బలమైన విపక్ష పాత్రకు సిద్ధంగా ఉంది. అయితే, ఈసారి విపక్ష నేత ఎవరు? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈసారి రాహుల్ గాంధీ ఈ పాత్రను పోషించాలని అటు కాంగ్రెస్‌తో బాటు పలు రాజకీయపక్షాలూ కోరుతున్నాయి. పాదయాత్రతో తానేంటో చాటుకోవటంతో బాటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో సొంత సర్కార్లను నడుపుతుండగా, తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అధికార కూటముల్లో భాగస్వామిగానూ ఉంది. దేశపు అతి ప్రాచీన రాజకీయ పక్షపు ప్రతినిధిగా రాహుల్ గాంధీ విపక్షనేతగా రాణించగలరనే నమ్మకం చాలా వర్గాల్లో వ్యక్తమవుతోంది.ప్రభుత్వం చేసే తప్పులను సకాలంలో ఎత్తిచూపించగల బాధ్యతాయుత సమర్థ ప్రతిపక్షం కోసం నేడు దేశం ఎదురుచూస్తోంది. దేశ విశాలహితం దృష్ట్యా అది ఒక తప్పనిసరి అవసరం కూడా. ఈ వాస్తవాన్ని గుర్తించి ఇకపై కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో, ఉమ్మడి దృక్పథంతో ఇకపై మందుకు నడవాలి. చర్చకు వచ్చిన కీలక అంశాల విషయంలో తమ వైఖరి, దృక్పథాలను విపక్షం పార్లమెంటు వేదికగా చెప్పగలగాలి. అదే సమయంలో భారత సమాఖ్యను బలోపేతం చేయడం, మసిబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రభను పునరుద్ధరించడంపై తమ ఆలోచనలను ప్రజలకు ఆయా వేదికల ద్వారా విస్పష్టంగా విడమరచాలి. రాబోయే ఐదేళ్లలో విపక్షం ఈ విషయంలో ఏమేరకు విజయం సాధించగలదనే దానిని బట్టే వచ్చే ఎన్నికల ఫలితాలు మాత్రమే గాక ఈ దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండబోతోంది.