జైపూర్‌, సెప్టెంబర్‌ 6: కోచింగ్‌ హబ్‌ కోటాలో విద్యార్ధుల సూసైడ్‌ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్ధి సూసైడ్‌ చేసుకున్నాడు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కల నెరవేర్చుకునేందుకు యేటా వేలాది మంది విద్యార్ధులు రాజస్థాన్‌లోని కోటాలోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్తుంటారు. అయితే చదువుల ఒత్తిడిలో చిత్తైపోతున్న పలువురు విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 13 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇక గతేడాది ఏకంగా 30 మంది విద్యార్థులు ఇక్కడ సూసైడ్‌ చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ మథురలోని బర్సానాకు చెందిన పరశురామ్‌ నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల క్రితం రాజస్థాన్‌లోని కోటాకు వచ్చాడు. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని కోచింగ్‌ క్లాసులకు హాజరవుతున్నాడు. అయితే, కొన్ని గంటల పాటు పరశురామ్‌ కనిపించకపోవడంతో ఇంటి యజమాని అనూప్‌ కుమార్‌ పోలీసులకు సమాచారం అందించాడు. బుధవారం సాయంత్రం సమయంలో పరశురామ్‌ను చివరిసారిగా చూశానని, ఆ తర్వాత నుంచి అతను కనిపించడం లేదంటూ అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ చేసి యజమాని అనూప్‌ తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరశురాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు పరశురాం గది తలుపులు పగలగొట్టి చూడగా.. ఇంట్లో ఉరేసుకొని కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్‌ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌ లాల్‌ బైర్వా తెలిపారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని అన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *