23న తెలుగు శక్తి ఆధ్వర్యంలో బహిరంగ చర్చా వేదిక
హాజరయ్యేందుకు బండారు సత్యనారాయణ మూర్తి అంగీకారం
మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం: మంత్రి రోజా పై బండారు చేసిన వ్యాఖ్యల పై నిజా నిజాలను నిర్ధారించుకునే క్రమంలో బహిరంగ చర్చావేదిక ఏర్పాటు చేస్తున్నట్టు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే బండారును చర్చా వేదికలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తూ వెన్నెల పాలెం లోని ఆయన నివాసానికి గురువారం మధ్యాహ్నం బి.వి.రామ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన రామకృష్ణ బీచ్ తీరంలో బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల సమక్షంలో కొనసాగే ఈ బహిరంగ చర్చ వేదికకు రావలసిందిగా బండారు సత్యనారాయణ మూర్తిని ఆహ్వానించగా ఆయన అంగీకరించారని రామ్ తెలిపారు. ఈ బహిరంగ చర్చా వేదికలో పాల్గొనేందుకు మంత్రి రోజా ను కూడా ఆహ్వానిస్తున్నామని.. ఆమె కూడా వస్తారని భావిస్తున్నాని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి రోజా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ మూర్తి వైఖరిని ఖండిస్తూ మంత్రి రోజా కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం.. న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేయడం సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహించబోయే బహిరంగ చర్చా వేదిక పై ఆసక్తి నెలకొంది.