న్యూ డిల్లీ మార్చ్ 19:రానున్న లోక్‌సభ ఎన్నికలకు పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) చేతులు కలపనున్నాయి. ఈ పార్టీల మధ్య మళ్లీ పొత్తు చర్చలు ఊపందుకున్నాయి. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్ధానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.పంజాబ్‌లో బీజేపీ, ఎస్‌ఏడీ మధ్య పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత, పార్టీ ప్రతినిధి ఎస్‌ఎస్ చన్నీ తెలిపారు. ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి..మార్చి 22న అకాలీదళ్ కోర్ కమిటీ భేటీ జరగనుంది. పొత్తుపై అకాలీదళ్ నిర్ణయం అనంతరం బీజేపీ, ఎస్‌ఏడీ మధ్య లాంఛనప్రాయంగా చర్చలు సాగుతాయని, ఆపై పొత్తు ఖరారు అవుతుందని చన్నీ చెప్పారు.పొత్తుపై తుది నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని అన్నారు. ఇక తమ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఎన్నికల పొత్తులు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని అకాలీదళ్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దల్జిత్ సింగ్ చీమా తెలిపారు. భావసారూప్యత కలిగిన పార్టీతో ఎన్నికల పొత్తు ఉండే అవకాశం ఉందని బీజేపీతో పొత్తుపై చీమా సానుకూల సంకేతాలు పంపారు.