370 టార్గెట్‌గా.. వై నాట్ సౌత్ అని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి.. దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. పదిరోజుల్లో రెండోసారి తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. రెండు రోజుల పాటు రోడ్‌షోలు, బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటున్నారు. సాయంత్రం మల్కాజ్‌గిరిలో రోడ్ షోలో పాల్గొన్నారు. రేపు నాగర్‌కర్నూల్ బహిరంగ సభకు హాజరవుతారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన.. మల్కాజ్‌గిరిని కమలం ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసింది బీజేపీ. ఆ తర్వాత కర్నాటకలోని గుల్బర్గలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఎల్లుండి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగే ఎన్డీయే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. వరుస పర్యటనలతో సౌతిండియాలోని రాష్ట్రాల్లో జోష్ పెంచుతున్నారు ప్రధాని మోదీ.దక్షిణ భారతంలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలో కేవలం 29 సీట్లు మాత్రమే బీజేపీ ఖాతాలో వున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు కర్నాటకలోనే వున్నాయి. దాంతో ఉన్నవాటిని కాపాడుకోవడంతోపాటు మిగిలిన 101 సీట్లలో కనీసం 50 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కర్నాటకలో ఈసారి బీజేపీ`జేడీఎస్ పొత్తుతో మొత్త 28 ఎంపీ సీట్లలో సగానిపైగా గెలవాలని గెలవాలని ప్లాన్ చేస్తోంది. ఏపీలోని 25, తెలంగాణలోని 17, తమిళనాడులోని 39, కేరళలోని 20 ఎంపీ సీట్లు కలిపితే 91 పార్లమెంటు సీట్లలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచేలా వ్యూహాలు రూపొందించింది. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవగా..ఈ సారి 12 స్థానాలు గెలవాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీలో ఎన్డీయే కూటమి కనీసం 18కి పైగా స్థానాలు గెలవాలని భావిస్తోంది. తమిళనాడులో గతంలోకన్నా? అణ్ణామలై పాదయాత్రతో కాస్తా మెరుగుపడ్డా బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి ఎక్కువ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తోంది. కేరళలో అక్కడ 45 శాతం వున్న మైనారిటీల మనసులు గెలుచుకునేందుకు బీజేపీ యధాశక్తి ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్సయితే అక్కడ రెండో, మూడో సీట్లు బీజేపీకి దక్కవచ్చని యోచిస్తోంది.బీజేపీ అంటే నార్త్ పార్టీ అని, సౌత్‌లో బలం లేదనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందుకే, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన పట్టు బిగించేందుకు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సౌత్‌ను రెఢ చేశారు. అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రచారాన్ని హోరెత్తించాలని పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది బీజేపీ.లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాలిలా పర్యటించి ప్రజలకు చేరువకానున్నారు. ఆపరేషన్ సౌత్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మోదీ.కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా మోదీ పర్సనల్ చరిష్మాతో సౌత్‌లో కూడా బలపడాలన్నది కమలం పార్టీ టార్గెట్. ఇందులో భాగంగా వారం రోజుల కిందట కూడా కేరళ, తమిళనాడుల్ని రౌండప్ చేశారు మోదీ. తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే వేదికపై శరత్‌కుమార్ దంపతులు మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలతో దేశానికి చేటు తప్పదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మనస్సులో మాత్రం తమిళనాడు ఉందంటూ సెంటిమెంట్‌తో కొట్టారు.మొత్తంగా సౌత్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసి, మరో రాష్ట్రానికి వెళ్లాలన్న విధానం కాకుండా ఒకేరోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళికను రూపొందించారు.