అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలిటిక్స్‌ ఆలోచనలకు అందవు. రాజకీయాల్లో మన తదుపరి అడుగును ప్రత్యర్థి ఊహించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌.. తన క్రేజీ డెసిషన్స్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. ఢల్లీిలో 2013లో అధికారాన్ని చేపట్టాల్సిన బీజేపీని ప్రతిపక్షానికి పరిమితం చేసిన ఆమ్‌ ఆద్మీ ఈ అరవింద్‌ కేజ్రీవాల్‌. దశాబ్దకాలం కాచుక్కూచున్న బీజేపీకి.. ఈ సారి కూడా అధికారాన్ని అందని ద్రాక్ష చేసేలా నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒక వైపు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలు, సుదీర్ఘ పాలన వల్ల సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్ష బీజేపీ చేసే బలమైన ఆరోపణలు, మరో వైపు లిక్కర్‌ కేసు ఉచ్చు.. ఇలా అన్నీ రౌండప్‌ చేస్తున్న వేళ అరవింద్‌ కేజ్రీవాల్‌ నిజంగానే మాస్టర్‌ స్ట్రోక్‌ ఇఛ్చారు. ఈ స్ట్రోక్‌తో ప్రతిపక్షానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందని చెప్పొచ్చు.బీజేపీకి ఇలా స్ట్రోక్‌లు ఇవ్వడం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇది కొత్తకాదు. 2013 నుంచి బీజేపీని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అవినీతికి వ్యతిరేక పోరాటాన్ని తన రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేసుకున్న అరవింద్‌ కేజ్రీవాల్‌.. నెత్తికి మఫ్లర్‌, కాళ్లకు స్లిప్పర్లు వేసుకుని, సాధారణమైన డ్రెస్సులో అంతే సామాన్యమైన వ్యవహారంతో ప్రజలకు చేరువయ్యాడు. తాను నిజంగానే ఆమ్‌ ఆద్మీని అన్ని విధాలా చాటిచెప్పాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించాడు.2013 వరకు 15 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ ఢల్లీిలో అప్రతిహతంగా అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకతను సమర్థవంతంగా క్యాప్చర్‌ చేసే పనిలో బీజేపీ ఉన్నది. 2013లో తమకే అధికారమన్న ధీమాతో పని చేసింది. కానీ, ఇంతలో అరవింద్‌ కేజ్రీవాల్‌ సుడిగాలిలా అడ్డుతగిలాడు. తన పార్టీని విశ్వసించి అధికారాన్ని ఇవ్వాలని, బీజేపీతో, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోనని తన పిల్లలపై ఒట్టు పెట్టాడు. కాంగ్రెస్‌ ఘోరంగా తుడిచిపెట్టుకుపోగా.. ఢల్లీిలోని 70 సీట్లల్లో బీజేపీ 31 సీట్లు, ఆప్‌ 28 సీట్లు గెలుచుకుంది. హంగ్‌ తీర్పు రావడంతో బీజేపీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటు పిలుపును నిరాకరించింది. మరోవైపు ఆప్‌ తన మార్క్‌ పాలిటిక్స్‌ కంటిన్యూ చేసింది. 30 డిమాండ్లను రిలీజ్‌ చేసింది. ఏడు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ డిమాండ్లను యాక్సెప్ట్‌ చేయడంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు.కానీ, 49 రోజులకే 2014 ఫిబ్రవరిలో సీఎంగా రిజైన్‌ చేశాడు. కాంగ్రెస్‌, బీజేపీలు వాటి అవినీతి విధానాలతో తమ పాలనలో అవాంతరాలు సృష్టిస్తున్నాయని ఆరోపించాడు. అప్పటికీ ఢల్లీిలో బీజేపీకి ఎక్కువ ఆదరణ ఉన్నదని, 2014లో తొలినాళ్లలోనే ఎన్నికలు జరిగి ఉంటే కచ్చితంగా బీజేపీ గెలిచేదనే అభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2014 అక్టోబర్‌లో కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌ వదిలాడు. ఎన్నికలంటే బీజేపీ పరుగు పెడుతున్నదని, ఓడిపోతామనే భయం ఆ పార్టీని పట్టిపీడుస్తున్నదని కామెంట్‌ చేశాడు. ఆప్‌ ప్రతినిధులు ఈ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఫలితంగా ప్రజల్లో బీజేపీ కంటే ఆప్‌ బలంగా ఉన్నదనే అభిప్రాయం వెళ్లింది. ప్రజల తీర్పును కాలరాసి రాజీనామా చేశాడని బీజేపీ ఆరోపణలకు పదునుపెట్టగా క్షమాపణలు చెబుతూ ప్రజల్లోకి వెళ్లాడు కేజ్రీవాల్‌. తనకు మరో అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడు.అప్పుడు 70 సీట్లల్లో 67 సీట్లు ఇచ్చి ఆప్‌ను ప్రజలు గెలిపించారు. ఇక 2020 ఫిబ్రవరిలో కేజ్రీవాల్‌ మూడోసారి అధికారాన్ని(63 సీట్లతో) చేపట్టాడు. ఈ సారి ఆప్‌ పై లిక్కర్‌ కేసు వంటి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అవినీతిపై పోరాటంతో పుట్టిన ఆప్‌ అవినీతి పార్టీ అనే ప్రచారాన్ని బీజేపీ బలంగా చేస్తున్నది. ఆమ్‌ ఆద్మీ అని చెప్పుకునే కేజ్రీవాల్‌.. ఢల్లీిలో విలాసవంతంగా నిర్మించిన భవంతిలో ఉంటున్నారని ఆరోపిస్తున్నది. అవినీతి కేసులో కేజ్రీవాల్‌ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. తొలిసారి జైలుకెళ్లిన సీఎం ఈయనే. ఈ సారి తమ గెలుపును ఆపేవారే లేరని బీజేపీ ధీమాగా ఉన్నది. కానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటే అంత సింపుల్‌ కాదు కదా!జార్ఖండ్‌లోనూ హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లే పరిస్థితులు వచ్చినప్పుడు సీఎం పదవికి రాజీనామా చేశాడు. అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా అలాగే రాజీనామా చేస్తాడని బీజేపీ ఆశించింది. కానీ, అవసరమైతే జైలు నుంచే పాలన చేస్తానని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని అరవింద్‌ కేజ్రీవాల్‌ తేల్చేశాడు. బీజేపీ ఎంత ఒత్తిడి తెచ్చినా తట్టుకుని రాజీనామా చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో బయటికి వచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్‌.. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అందరి అంచనాలను తలకిందులు చేశాడు. తనపై అవినీతి కేసును ప్రజా కోర్టులో తేల్చుకుంటానని, ప్రజలు ఇచ్చే తీర్పు.. ఈ లిక్కర్‌ కేసు మరకను తుడిచివేస్తుందని చెప్పాడు. ఇది ప్రతిపక్షానికి దిమ్మదిరిగే షాక్‌. అరవింద్‌ కేజ్రీవాల్‌పై పొలిటికల్‌గా ఎలా దాడి చేయాలా? అనే ఆలోచనలో పడిపోయింది అపోజిషన్‌.ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం పదవి నుంచి తప్పుకుంటాడు. ఒక ఎమ్మెల్యేగా ఈ కేసుపై పోరాడుతాడు. దీంతో రాహుల్‌, సోనియాపై బీజేపీ విరుచుకుపడినట్టుగా బెయిల్‌ సీఎం లాంటి పంచ్‌లు విసరలేదు. అధికారానికి పాకులాడుతాడనే ఆరోపణలూ చేయలేదు. సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ విలాసవంతమైన భవంతిని కేజ్రీవాల్‌ వదిలి.. మళ్లీ తాను సాధారణ పౌరుడినే అనే నెరేటివ్‌ ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లవచ్చు. కేజ్రీవాల్‌ సాధారణ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వం నుంచి డిస్టెన్స్‌ పెంచుకోవడం.. కొత్త ముఖం సీఎంగా రావడంతో అవినీతి ప్రభుత్వమనే అభిప్రాయాలు కనుమరుగు కావొచ్చు.సీఎంగా అతిషీని ఎంచుకోవడం కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌ మాస్టర్‌ స్ట్రోకే. మహిళకు అగ్రపదవిని కట్టబెట్టడమే సాఫ్ట్‌ కార్నర్‌ సంపాదించడంతోపాటు చాలా పోర్ట్‌ఫోలియోలు నిర్వహించిన అనుభవమున్న అతిషి.. ప్రభుత్వ విజయాలను ప్రభావవంతంగా ప్రచారం చేయగలదు. ఆమె మహిళ కావడం మూలంగా బీజేపీ దూకుడుగా ఆరోపణలు చేయడం కష్టసాధ్యమే. అతిషి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేస్తే.. బీజేపీని రాజకీయంగా కేజ్రీవాల్‌ ఎదుర్కోవచ్చు. ఎన్నో వనరులున్న బీజేపీకి ఈ సారి కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌ అగ్నిపరీక్షే పెడుతున్నాడు. ఎన్నికల వరకు ఇంకా ఎన్ని పొలిటికల్‌ స్టంట్లు జరుగుతాయో చూడాల్సిందే మరి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *