లక్నో మార్చ్ 11:డీప్‌ఫేక్ వీడియోస్ ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కృత్రిమ మేధ ను ఉపయోగించి సృష్టిస్తున్న ఇలాంటి వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొందరు విచ్చలవిడిగా ఏఐని ఉపయోగించి ప్రముఖుల వీడియోలను యథేచ్ఛగా మార్ఫింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయనేతల మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు.డయాబెటిస్ ఔషధానికి యోగి ప్రచారం చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్ వంటి తదితర స్టార్ నటులకు చెందిన నకిలీ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.