కొలకత్తా మార్చ్‌ 2: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్‌లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్‌ ఔర్‌ కరప్షన్‌ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. సభకు వచ్చిన మిమ్మల్నందరినీ చూస్తుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 400కు పైగా లోక్‌సభ స్థానాలు గెలువడం ఖాయమనిపిస్తోందని అన్నారు.అదేవిధంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమబెంగాల్‌లోని మొత్తం 42 సీట్లకు 42 సీట్లు గెలువాలని ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి లక్ష్యం నిర్దేశించారు. రాష్ట్ర బీజేపీ కలిసికట్టుగా పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలని పిలుపునిచ్చారు. అరాచకాలు, వారసత్వ రాజకీయాలు, విద్వంసాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పర్యాయపదమని ఆయన వ్యాఖ్యానించారు.అలాగే సందేశ్‌ఖాలి ఉదంతాన్ని ప్రధాని మోదీ లేవనెత్తారు. రాష్ట్రంలో మహిళలకు అండగా నిలువాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని తల్లులు, చెల్లెల్లు న్యాయం కోసం అభ్యర్థిస్తుంటే ప్రభుత్వం వారి గోడును వినిపించుకోవడం లేదని మండిపడ్డారు. మహిళల సంక్షేమం పేరుతో ఓట్లు గుంజిన టీఎంసీ ఇప్పుడు మహిళలను ఏడిపిస్తోందని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *