న్యూ డిల్లీ మార్చ్ 2:కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత జైరాం రమేశ్ లకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 19 సెకన్ల క్లిప్పింగ్‌ను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. గ్రామస్థులు, పేదలు, కూలీలు, రైతులు సంతృప్తికరంగా లేరు. గ్రామాల్లో మంచి రోడ్లు లేవు, తాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేవు అంటూ గడ్కరీ వీడియోలో అన్నారు. అయితే, కాంగ్రెస్ షేర్ చేసిన ఆ వీడియో క్లిప్‌పై గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న చర్యల గురించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ ఈ పోస్ట్ పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సందర్భం ఉద్దేశాన్ని బయటపెట్టకుండా అర్థం మారేలా ఆ క్లిప్పింగ్‌లో మార్పులు చేశారని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, నన్ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని అన్నారు. ఈ మేరకు తన లాయర్ ద్వారా ఖర్గే, జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు చెప్పారు. నోటీసులు అందిన 24 గంటల్లో ఆ వీడియో క్లిప్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మూడు రోజుల్లో తనకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.