భారతదేశంలో తొలి స్వాతంత్య్ర తిరుగుబాటు 1857లో మొదలైంది. కానీ అంతకు పదేళ్ల ముందే బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.1846 జూన్‌ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన వీరమరణంతో ముగిసింది. ఈ 8 నెలల కాలంలో బ్రిటీష్‌ వారిని ముప్పుతిప్పలు పెట్టి.. మూడు కాదు ముప్పై చెరువుల నీళ్లు తాగించాడు నరసింహారెడ్డి. తనకు రావాల్సిన భరణాన్ని ఇవ్వకుండా.. తన అనుచరుడిని అతి దారుణంగా బ్రిటీష్‌ వాళ్లు చంపేయడంతో వాళ్లపై తిరుగుబాటు చేస్తాడు ఉయ్యాలవాడ. కోయిలకుంట్లతో పాటు మరికొన్ని ధనాగారాలపై తన అనుచరులతో దాడి చేసి.. వాటిని దోచేస్తాడు నరసింహారెడ్డి. ఆ తర్వాత ఆయన కోసం బ్రిటీష్‌ వాళ్ళు వెతుకుతారు. తనను పట్టుకోవాలని చూసిన బ్రిటీష్‌ వాళ్లను కూడా చంపేస్తాడు రెడ్డి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాళ్ల ఖజానాలపై పడి తుపాకులతో పాటు నగదును కూడా దోచుకెళ్లేవాడు ఉయ్యాలవాడ. ఆ రోజుల్లోనే ఉయ్యాలవాడను పట్టుకుంటే 1000 రూపాయల నజరానా ప్రకటించింది బ్రిటీష్‌ ప్రభుత్వం. దాన్నిబట్టి ఆయన ఎంతగా వాళ్లను భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. కడప స్పెషల్‌ కమిషనర్‌ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు.1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్‌ కాక్రేన్‌ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *