మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. యునెస్కో 1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. బంగ్లాదేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు ) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 లో భారత దేశం, పాకిస్తాన్‌ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌ రెండు భౌగోళికంగా వేర్వేరు భాగాలు ఏర్పడిరది. ఒకటి తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అని పిలుస్తారు) రెండవది పశ్చిమ పాకిస్తాన్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌ అని పిలుస్తారు). సంస్కృతి, భాష మొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది.తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పుడు బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్తాన్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌ ) కలిపి మెజారిటీ ప్రజలు బెంగాలీ లేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్‌ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్‌ ప్రజలు అభ్యంతరం తెలిపారు.తూర్పు పాకిస్తాన్‌ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ను తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్‌ దత్తా 1948 ఫిబ్రవరి 23 న పాకిస్తాన్‌ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్‌ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్‌) నిరసనలు చేపట్టారు. భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం 144 సెక్షన్‌, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించింది. ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్‌, రఫీక్‌, జబ్బర్‌, షఫియూర్‌ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు. పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్‌ అదే రోజు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8 న పాకిస్తాన్‌ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1956 లో పాకిస్తాన్‌ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్‌ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్‌ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్‌ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడిరది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *