బెంగళూరు, ఫిబ్రవరి 13: రుణ శేషం.. శత్రుశేషం ఉండకూడదు అంటారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాంటి అంచనానే వేసుకున్నట్టున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే గత రెండు పర్యాయాలు లేని విధంగా పొత్తులకు శ్రీకారం చుడుతున్నారు. అనేక సర్వే సంస్థలు బిజెపి సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నప్పటికీ నరేంద్ర మోడీబి అమిత్ షా ద్వయం ఊరుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెడితే తమిళనాడులోని రామేశ్వరం వరకు ప్రతి ప్రాంతం పైన అత్యంత సీరియస్ గా దృష్టి సారించారు. ‘‘బలం ఉన్నచోట మరింత బలం పెంచుకోవడం.. బలం లేనిచోట బలాన్ని పెంచుకోవడం..’’ ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త పొత్తులకు.. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే ఎత్తులు వేస్తున్నారు.ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చింది. ఎన్నికల్లో నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది. రెండవ మాటకు తావు లేకుండా ఎన్డీఏలో చేరుతున్నామని ప్రకటించింది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి విపరీతమైన బలం ఉంది. దానికి ఆ రాష్ట్రంలో ఇంకో పార్టీ అవసరం లేదు. కానీ రాష్ట్రీయ లోక్ దళ్ వస్తాను అని చెప్పగానే వెల్కం అంటూ చేర్చుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్ సహాయంతో కొన్ని సీట్లయినా గెలుచుకోవాలని భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా సీట్లు గెలుచుకుంటే మొదటికే మోసం వస్తుందని నరేంద్ర మోడీబి అమిత్ షా ద్వయం భావించి దానికి ఆస్కారం లేకుండా ఉండేందుకు పావులు కదిపారు. రాష్ట్రీయ లోక్ దళ్ ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారు. కేవలం ఈ పార్టీ మాత్రమే కాదు కర్ణాటక కు చెందిన జనతా దళ్ యూనియన్ ఎన్డీఏ కూటమిలో చేరింది. గత ఎన్నికల్లో అక్కడ బిజెపి ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మెరుగైన స్థానాలు గెలుచుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే కుమారస్వామి పార్టీకి ఆఫర్ ఇచ్చింది. స్వామి కూడా పోలోమంటూ ఎన్డీఏ కూటమిలో చేరారు.కేంద్రంలో ఈ దఫా కూడా అధికారంలోకి వస్తుంది అనే సానుకూల వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. బిజెపి ఏ అవకాశాన్ని కూడా అంత సులభంగా వదులుకోవడం లేదు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని భావిస్తున్నది. ఈ సారి ప్రభుత్వం ఏర్పడితే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ప్రతిపక్ష పార్టీల ముందరికాళ్ళకు బంధం వేయాలని బిజెపి భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో లుకలుకలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసి 400కు పైచిలుకు స్థానాలను గెలుచుకుని మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తోంది.. ‘‘ప్రతిపక్షాలు ఎక్కువ స్థాయిలో ఉంటే మాకు చాలా ఇబ్బంది. అవి మా చెవులను ఇబ్బంది పెడుతూనే ఉంటాయని’’ గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన తోమర్ పార్లమెంట్ లో వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన ఊరకనే ఆ వ్యాఖ్యలు చేశారని అందరూ అనుకున్నారు. కానీ ఆ వ్యాఖ్యల వెనుక నరేంద్ర మోడీ ఉన్నారని ఎవరూ ఊహించలేదు.. కాంగ్రెస్ ను సాధ్యమైనంత వరకు నిర్వీర్యం చేసి.. తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే పొత్తుల వెనుక పరమార్థం లాగా కనిపిస్తోంది. ఆ మధ్య ‘‘కుటుంబ నియంత్రణ అనేది వ్యక్తులకే.. రాజకీయ పార్టీలకు కాదు.. ఎంతమంది ఉంటే అంత బలం అని’’ అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులు నాడు ఆయన చేసిన వ్యాఖ్యలకు అద్దం పడుతున్నాయి.