న్యూ డిల్లీ ఫిబ్రవరి 9:భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత హోం మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయి. దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టం అని ప్రధాని మోదీ కొనియాడారు.
పీవీ నరసింహారావు..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం ఆనందంగా ఉంది. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాలలో విస్తృత సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏళ్లుగా ఆయన విశేష కృషి చేశారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించింది. నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఎంఎస్ స్వామినాథన్..
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశానికి చేసిన విశేష కృషికి గానూ భారతరత్న ఇవ్వడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సంక్షేమానికి వ్యవసాయం, రైతులు మూలస్తంభాలు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వ్యవసాయంలో తీసుకువచ్చిన మార్పులు పెనుమార్పులు తీసుకువచ్చాయి. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక ఆవిష్కర్తగా, మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన ముందుచూపు వ్యవసాయ రూపరేఖలు మార్చడమే కాకుండా ఆహార భద్రతకు హావిూ ఇచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.