న్యూ డిల్లీ ఫిబ్రవరి 9:రైతు దూత.. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ను భారతరత్నతో భారత ప్రభుత్వం గౌరవించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఆయన జీవిత విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా దేశ స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు. ‘భారతీయ రైతుల ఛాంపియన్‌’గా ఆయన విశిష్ఠ గౌరవం పొందారు. ఒక్కసారి కూడా పార్లమెంట్‌కు హాజరుకాని ఏకైక ప్రధానమంత్రిగా చౌదరి చరణ్‌ సింగ్‌ రికార్డులకు ఎక్కారు.చౌదరి చరణ్‌ సింగ్‌ 1902లో ఉత్తరప్రదేశ్‌లోని విూరట్‌లో జన్మించారు. 1937లో చప్రౌలీ నుంచి తొలిసారి ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1946, 1952, 1962, 1967లలోనూ విజయాలు సాధించారు. ఉత్తరప్రదేశ్‌ సీఎంగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో తొలిసారి, 1970లో రెండవసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 1980లో ఆయన ‘లోక్‌దల్‌ పార్టీ’ స్థాపించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన చౌదరి చరణ్‌ సింగ్‌ బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. మహాత్మా గాంధీ సూచించిన అహింసాయుత మార్గాన్ని ఎంచుకొని చురుగ్గా స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కాగా చౌదరి చరణ్‌ సింగ్‌ తండ్రి, తాతయ్యలు కూడా దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితికి వ్యతరేకంగా ఉద్యమించిన నాయకులు ‘జనతా పార్టీ’గా ఏర్పడి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. అయితే వ్యక్తిగత ప్రతిష్ఠ, అహంభావాల కారణంగా కలిసి ఉండలేకపోయారు. ఆ పరిస్థితుల్లో చౌదరి చరణ్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్ధతు ఇస్తుందని రాష్ట్రపతికి ఇందిరా గాంధీ లేఖ రాశారు. దీంతో రాష్ట్రపతి ఆహ్వానంతో చౌదరి చరణ్‌ సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తన డిమాండ్‌కు అంగీకరించకపోవడంతో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ మద్ధతును ఉపసంహరించుకున్నారు. దీంతో ఒక్కసారి కూడా పార్లమెంట్‌కు వెళ్లని ప్రధానమంత్రిగా చౌదరి చరణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *