విజయవాడ, డిసెంబర్ 27: ఆ మధ్య కేటీఆర్ తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అసలు విూకు పొలిటికల్ స్ట్రాట జిస్టులతో అవసరమేంటి? విూరు ఏం చేయాలో కూడా వాళ్లే చెబితే ఇక విూరు ఎందుకు? ప్రజలకు, విూకు మధ్య మూడోవాడు దూరి ఏం చేయాలో చెబుతుంటే ప్రజాప్రతినిధులుగా విూరు ఎన్నికవ్వడం దేనికి? అని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించాడు. ఇది ఒక రకంగా డిబేటబుల్ ప్రశ్న. కానీ ఇదే రాధాకృష్ణ కు త్వరలోనే అటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తన కు అత్యంత ఇష్టమైన చంద్రబాబు నాయుడు కు పని చేస్తాడని ఊహించి ఉండడు కావచ్చు. ఎందుకంటే త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.. తనకు ఇప్పుడు విజయం అనివార్యం కాబట్టి.. చంద్రబాబు నాయుడు బిహారీ పీకే తలుపు తట్టాడు. వాస్తవానికి పీకే అంత ఫామ్ లో లేడు. పైగా ఐ ప్యాక్ నుంచి బయటికి వచ్చానని అప్పట్లోనే చెప్పాడు. అయితే మొన్నటిదాకా ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ తెరవెనుక భారీ కసరత్తు చేశాడు.అయితే అప్పట్లో కోడి కత్తి వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు నాయుడు పలు విధాలుగా ఆరోపించాడు. ఆయన బిహారి వ్యక్తి అని, అటువంటి వ్యక్తి ఇస్తున్న సలహాలతో రేపు జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అదేవిధంగా అవుతుందని అప్పట్లో ఆరోపించాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అదే బిహారీ వ్యక్తి అవసరం ఇప్పుడు చంద్రబాబుకు పడిరది. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పీకే తలుపు తట్టాడు కావచ్చు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అంతా ఫామ్ లో లేడు. ఎందుకంటే ఆయన గతంలో పనిచేసిన వారంతా ఓటమి బాట పట్టారు. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశాడు. అక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తర్వాత కర్ణాటక ఎన్నికల్లోనూ తన మార్క్ పైత్యాన్ని ప్రదర్శిస్తే బయటికి వెళ్లిపో అని కాంగ్రెస్ పార్టీ పంపించేసింది. 2014 ఎన్నికల్లో బిజెపికి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ను.. కొంతకాలానికి నరేంద్ర మోడీ బయటికి పంపించాడు. ప్రశాంత్ కిషోర్ గ్రూపులో గతంలో పనిచేసిన రాబిన్ శర్మ, ఇతర వ్యక్తులు వేరు కుంపట్లు పెట్టుకున్నారు.. ప్రస్తుతానికి టీడీపీ సోషల్ విూడియా విభాగాన్ని రాబిన్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. సునీల్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆయనే తన భుజస్కందాల విూద మోసారు. ఇప్పుడు మహారాష్ట్ర బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారని తెలుస్తోంది. ఇప్పుడు ఇక ఏపీలో రిషి రాజు అనే వ్యక్తి అక్కడి అధికార వైసిపికి పనిచేస్తున్నాడు. ఇతర మాత్రమే కాకుండా ప్రణయ్ రాయ్ అనే ప్రసిద్ధ జర్నలిస్టు తో కలిసి జగన్మోహన్ రెడ్డి చాలా లోతైన సర్వే నిర్వహించాడు. అయితే ఎక్కడైతే ప్రజాభిమానాన్ని చూరగొనడంలో విఫలమైన ఎమ్మెల్యేలను జగన్ వెంట వెంటనే మార్చేస్తున్నాడు. ఇది ఇటీవలీ ఎన్నికల్లో కేసీఆర్ కు చేతకాలేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపిస్తున్నాడు. అయితే ఈ చర్యలు వైసీపీకి మళ్ళీ అధికారాన్ని కట్టబెడతాయా అంటే? ఎస్ అని చెప్పలేని స్థితి.వాస్తవానికి పీకే ను గతంలో బిహారి డెకాయిట్ అని చంద్రబాబు తిట్టాడు. కానీ అదే పీకేతో ప్రస్తుతం ఏపీలో పని చేయబోతున్నాడు. ఈ పీకే మాత్రం ఏం తక్కువ కాదు.. ఎక్కడైతే అధికారంలోకి వస్తుంది అని అనుకుంటాడో ఆ పార్టీకి వ్యూహ కర్తగా మారిపోతాడు. వెంటనే అక్కడ తన మార్క్ వ్యూహాలను అమలు చేయడం మొదలుపెడతాడు. విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిసి ఆ పార్టీకి వ్యూహకర్తగా మారిపోయాడు. సేమ్ బెంగాల్లో కూడా అలాగే.. ఇదే ప్రశాంత్ కిషోర్ పంజాబ్లో కాంగ్రెస్ కు పని చేస్తే అది అట్టర్ ఫ్లాఫ్ అయింది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితితో కొద్దిరోజులు ట్రావెల్ చేశాడు.. కానీ కెసిఆర్ ఇద్దరి కంటే చాణక్యుడు కాబట్టి బయటికి తరిమేశాడు..సో ఇన్ని విషయాలు తెలిసి కూడా చంద్రబాబు పీకే ను ఎందుకు నమ్ముకున్నాడు? తెరవెనుక ఏవైనా వ్యవహారాలు నడిపిస్తున్నాడా? ఇండియా కూటమిలో యాక్టివ్ గా లేడు. ఎన్డీఏ కూటమిలోకి రానివ్వడం లేదు. సో పీకే ద్వారా ఏమైనా మంత్రాంగం నెరుపుతున్నాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు టిడిపి సోషల్ విూడియాను రాబిన్ శర్మ నడిస్తున్న నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్ అతడు కలిసి పనిచేయగలుగుతారా? అనేది కూడా ఒకింత అనుమానమే. మరి ఈ పీకేతో ఎన్నికల గోదావరి చంద్రబాబు ఎలా ఈదుతాడో మరి?!