పట్నా సెప్టెంబర్ 25: : జేడీ(యూ) మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వార్తలను బిహార్ సీఎం నితీష్ కుమార్ తోసిపుచ్చారు. ఎన్డీయేకు జేడీయూ తిరిగి దగ్గరవుతుందని విూడియాలో సాగుతున్న ప్రచారం ఊహాజనితమేనని ఆయన కొట్టిపారేశారు. విపక్ష ఇండియా కూటమిని బలోపేతం చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని నితీష్ కుమార్ పేర్కొన్నారు.భావి ప్రధాని లక్షణాలు తనకే ఉన్నాయని పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సైతం తాను తోసిపుచ్చానని, ఇలాంటి ప్రకటనలు చేయవద్దని తాను పార్టీ నేతలను కోరానని ఆయన గుర్తుచేశారు. విపక్ష ఇండియా కూటమిని బలోపేతం చేయడమే తన కర్తవ్యమని, ఈ దిశగానే తాను పనిచేస్తున్నానని నితీష్ పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై నితీష్‌ను ప్రశ్నించగా, ఈ ప్రశ్నను డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను అడగాలని అన్నారు.బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ఈ విషయం వదిలేయాలని, సమాజంలోని అన్ని వర్గాల మేలు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కాగా, ప్రధాని అభ్యర్ధి కాగల సామర్ధ్యం ఉన్నవిపక్ష కూటమి నేతల్లో నితీష్ కుమార్ కంటే మెరుగైన వారు ఎవరూ లేని జేడీయూ సీనియర్ నేత, బిహార్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ పేర్కొన్నారు.