ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి లో ఐక్యత మేడిపండు సామెతను తలపిస్తోంది. భారతీయ జనతా పార్టీని ఓడిరచడమే కూటమిలోని అన్ని పార్టీల ఉమ్మడి లక్ష్యమైనప్పటికీ.. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ ఒక్కరూ రాజీపడే ప్రసక్తే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ‘వేదికపై నేతల చేతులు కలుస్తున్నాయి తప్ప.. మనసులు మాత్రం కలవవు’ అని గతంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించినట్టుగానే కూటమిలో వివిధ పార్టీల మధ్య పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలో గెలిస్తే ఢల్లీి పీఠాన్ని అధిరోహించవచ్చు అని చెప్పుకునే ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఈ పరిస్థితి నెలకొంది. 80 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆధిపత్యం కోసం సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నెలకొంది. తాము విపక్ష కూటమి నుంచి సీట్లు కోరుకోవడం లేదని, ఉత్తర్‌ప్రదేశ్‌లో కూటమి సభ్యులకు తామే సీట్లు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి.ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో జట్టుకట్టిన విపక్షాలు తమ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తోడు.. ఉన్న కూటమిలో ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఆధిపత్యం తమదేనని చాటుకునే యత్నాలు చేస్తున్నాయి. తాజాగా అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోనే పరిగణించాల్సి ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీయే బలంగా ఉంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రభావం ఆ రాష్ట్రంలో సోనియా, రాహుల్ గాంధీలు పోటీ చేస్తూ వచ్చిన రాయ్‌బరేలీ, అమేథీ మినహా మరెక్కడా లేదు. 2019లో అమేథీలో రాహుల్ గాంధీ సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ తర్వాత బలంగా ప్రాంతీయ పార్టీల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉన్నప్పటికీ.. ఆ పార్టీ ఇండి`కూటమిలో చేరలేదు. మరో ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ) ప్రభావం యూపీ పశ్చిమ ప్రాంతంలో జాట్ వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే పరిమితం. ఈ స్థితిలో ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటులో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ బలమైన సమాజ్‌వాదీ, ఆల్‌ఎల్డీలపై పెత్తనం చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఈ స్థితి నుంచే ఉద్భవించాయి. యూపీలోని 80 సీట్లలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో.. ఎక్కడెక్కడ పోటీ చేయాలో నిర్ణయించేది తానేనని తేల్చి చెప్పేశారు. అంటే ఇండి`కూటమిలో ఉత్తర్‌ప్రదేశ్ జట్టు కెప్టెన్ తానేనని తనకు తానే ప్రకటించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలు సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కాంగ్రెస్‌తో పాటు కృష్ణపటేల్ వర్గానికి చెందిన అప్నాదళ్, దళిత ఉద్యమ నేత చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ కూడా ఉన్నాయి. యూపీలోని డజను లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్‌ఎల్‌డీ సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ కూడా రెండు డజన్ల స్థానాలను గుర్తించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఆర్‌ఎల్డీ, కాంగ్రెస్ కలిసి 3 డజన్లు పంచేసుకుంటే సమాజ్‌వాదీకి మిగిలేవి సగం సీట్లు మాత్రమే. అందుకే సీట్ల పంపకాల ఫార్ములాను తన చేతుల్లోనే ఉంచుకోవాలని సమాజ్‌వాదీ భావిస్తోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో 50 నుంచి 55 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్‌కు పెత్తనం ఇస్తే 40 సీట్లకు మించి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. కూటమిలో సీట్ల పంపకం ఫార్ములా ఇంకా ఖరారు కానప్పటికీ, 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న పార్టీ నేతలకు అఖిలేష్ యాదవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూపీలో ఎస్పీ కచ్చితంగా కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తుంది. కానీ పెత్తనం మాత్రం ఆ పార్టీ చేతిలో పెట్టాలనుకోవడం లేదు. ఏమాత్రం పట్టుజారినా.. 90వ దశకంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి సమాజ్‌వాదీకి బలమైన ఓటుబ్యాంకుగా మారిన ముస్లిం ఓటర్లు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా పార్టీ సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని నాలుగు స్థానాల్లో ఎస్‌పి తన అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, రాజస్థాన్‌లో రాజ్‌గఢ్`లక్ష్మణ్‌గఢ్ అసెంబ్లీ నుండి మాజీ ఎమ్మెల్యే సూరజ్‌భన్ ఢంకాను అభ్యర్థిగా ప్రకటించింది. ముంబయిలో జరిగిన విపక్ష కూటమి సమావేశంలోనే ఎస్పీ సీట్ల పంపకాల అంశాన్ని లేవనెత్తింది. వీలైనంత త్వరగా ఫార్ములాను నిర్ణయించాలని కోరింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత సీట్ల పంపకంపై చర్చించాలని కాంగ్రెస్ భావిస్తోంది.సీట్ల పంపకం విషయంలో యూపీలో కాంగ్రెస్ కు సీట్లు ఇవ్వడమే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికలకు కూడా సీట్లు వస్తాయని అఖిలేష్ యాదవ్ వ్యూహం. కాగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీట్ల పంపకం జరిగితే.. రాష్ట్రాల్లో సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నది కాంగ్రెస్ వ్యూహం. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ వేసిన ఎత్తుగడను చూస్తే దీని వెనుక కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలనే వ్యూహం దాగి ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ చెక్‌మేట్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..!