కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్తా గతేడాది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను ఏ విధంగా రణరంగంగా మార్చాయో అందరికీ తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే గత కొంత కాలంగా మణిపూర్‌లో డ్రోన్ దాడులు సంచలనం సృష్టించగా.. తాజాగా జరిగిన ఓ ఘటన మళ్లీ హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోశాయి. తాజాగా జిరిబం జిల్లాలో శనివారం ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజులుగా మణిపూర్‌లో హింస చెలరేగుతుండటం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.జిరిబం జిల్లాకు సవిూపంలో ఉన్న ఓ ఇంట్లో చొరబడిన మిలిటెంట్లు.. గాఢనిద్రలో ఉన్న ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. అనంతరం విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మిలిటెంట్లతో పాటు ఓ సాధారణ పౌరుడు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. చురాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన 3 బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇక ఇటీవల బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను చురాచాంద్‌పూర్ నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.కొత్త తరహా దాడులతో రెచ్చిపోతున్నారు కుకీ తీవ్రవాదులు . డ్రోన్లు , రాకెట్ దాడులతో రాజధాని ఇంఫాల్ లోని ప్రముఖ నాయకుల ఇళ్లను వాళ్లు టార్గెట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్రం మణిపూర్‌లో తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. డ్రోన్లు , రాకెట్‌లను వాళ్లు ప్రయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా మణిపూర్‌లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. డ్రోన్ దాడులకు కుకీ తీవ్రవాదులే కారణమని మెయితీ వర్గం ఆరోపిస్తోంది. సరిగ్గా పదహారు నెలల క్రితం మణిపూర్ మంటల్లో రగిలిపోయింది. గతేడాది మే 3న చెలరేగిన అల్లర్లు దాదాపు సంవత్సరం పాటు తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యాయి. కొన్ని రోజులు ఈ పరిస్థితులు కాస్త సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో.. మణిపూర్ అంతర్యుద్దం కాస్తా యుద్ధంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్`రష్యా, ఇజ్రాయెల్`హమాస్ యుద్ధంలో మాదిరి డ్రోన్లతో రాకెట్ దాడులకు తెగబడుతున్నారు మిలిటెంట్లు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాకు సవిూపంలోని రెండు ప్రదేశాల్లో జనావాసాలపై బాంబులు వేయడానికి ఉగ్రవాదులు డ్రోన్‌లను ఉపయోగించారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో రాత్రుళ్లు అందరూ లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మణిపూర్‌లోని బిష్ణుపూర్, ఇంఫాల్ తూర్పు జిల్లాల శివార్లలోని నివాసితులు డ్రోన్‌ల దాడులకు భయపడుతూ బతుకుతున్నారు. సెప్టెంబర్ 6న బిష్ణుపూర్ జిల్లాలో మిలిటెంటు లాంగ్ రేంజ్ రాకెట్‌లను మోహరించారు. మణిపూర్ మొదటి ముఖ్యమంత్రి మైరెంబమ్ కోయిరెంగ్ నివాసంపై రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక సీనియర్ సిటిజన్ ప్రాణాలు కోల్పోగా.. బిష్ణుపూర్ జిల్లా మొయిరాంగ్ ఖోయిరు లైకైలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.కొండ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించేందుకు పోలీసు బృందాలు, అదనపు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముల్సాంగ్ గ్రామంలో రెండు బంకర్‌లు, చురచంద్‌పూర్‌లోని లైకా ముల్సౌ గ్రామంలో ఒక బంకర్‌ను భద్రతా బలగాలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఎస్పీతో సహా బిష్ణుపూర్ జిల్లా పోలీసు బృందాలు అనుమానిత కుకీ మిలిటెంట్లు కాల్పులు జరిపిన ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే, పోలీసు బృందం గట్టిగా ప్రతిఘటించి దాడిని తిప్పికొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. డ్రోన్లతో జరిగే దాడులను అడ్డుకోడానికి భారత వైమానిక పెట్రోలింగ్‌కి చెందిన మిలటరీ హెలికాప్టర్‌ను మోహరించారు. శాంతిభద్రతలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు, ఎలాంటి ఆకస్మిక పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు అవసరమైన ప్రత్యేక బలగాలను సిద్ధం చేస్తున్నారు.మణిపూర్‌లో భారీ మిలిటెంట్ సమూహాల కదలికలపై నిఘా ఉంచడానికి భద్రతా బలగాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి. బిష్ణుపూర్ జిల్లాలో, ఆకాశంలోకి లైటింగ్ రౌండ్లు కాల్పులు జరుపుతున్నారు. యుద్ధాన్ని తలపించే ఈ పరిస్థితికి ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఈ గందరగోళం మధ్య భద్రతా బలగాలు కాల్పులు జరిపారా లేదంటే మిలిటెంట్లు కాల్పులు జరుపుతున్నారో తెలియక ప్రజలంతా బిక్కు బిక్కుమంటున్నారు. మరోవైపు, భద్రతా బలగాలు మిలిటెంట్ల బంకర్లను ధ్వంసం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, మణిపూర్‌లో డ్రోన్ ఆయుధాన్ని ఉపయోగించిన మొదటి సంఘటన సెప్టెంబర్ 1న ఇంఫాల్ పశ్చిమ జిల్లా కౌత్రుక్ గ్రామంలో జరిగింది. ఈ దాడిలో మిలిటెంట్లు తుపాకులు కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఆ తర్వాత రోజు, దాదాపు మూడు కిలోవిూటర్ల దూరంలో ఉన్న సెంజామ్ చిరాంగ్‌లో మరో డ్రోన్ దాడి జరగ్గా ఇందులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇలా వరుస దాడులతో మణిపూర్ యుద్ధ వాతావరాణాన్ని తలపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.అయితే, మణిపూర్‌లో డ్రోన్లు ఎగరడం ఇటీవల కాలం షారామూమూలు అయ్యింది. కుకీ`జో తెగలు, మెజారిటీ మైతేయీల మధ్య గతేడాది వివాదం మొదలైనప్పటి నుండీ కెమేరా డ్రోన్లు ఎగురుతుండటం కనిపిస్తూనే ఉంది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను సవిూక్షించడానికి అధికారులతో పాటు.. యూట్యూబర్లు కూడా డ్రోన్ కెమేరాలను వినియోగిస్తున్నారు. భద్రతా దళాల నిఘా డ్రోన్లు కూడా తిరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు డ్రోన్లతో లాంగ్ రేంజ్ రాకెట్లతో గ్రెనేడ్లను వదలడం ఆందోళన కలిగిస్తోంది. కుకీ చొరబాటుదార్లు వీటిని ప్రయోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుకీ తెగలు నివాసముండే ప్రాంతాల నుండి ఈ డ్రోన్లు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇవి నిజంగానే కుకీ మిలిటెంట్లు పంపిస్తున్నరా లేదంటే దీని వెనుక బయటి శక్తులు కుట్ర దాగుందా అనేది అర్థం కావట్లేదు.మైతేయి తెగకు రిజర్వేషన్లు కల్పిస్తూ మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో ఏడాది క్రితం మణిపూర్‌లో హింస రాజుకుంది. అనాలోచితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తోడు.. చారిత్రిక శత్రుత్వం తోడయ్యి.. వందల మంది ప్రాణాలను బలిగొన్న ఈ హింస 2023 మే 3న మొదలైయ్యింది. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన మణిపూర్ సెగలు యావత్ దేశాన్ని కలవరానికి గురిచేశాయి. అలాంటి ఆందోళనల మధ్య ఇప్పుడు డ్రోన్ల దాడులు మణిపూర్‌లో మరింత హింసకు దారితీస్తాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అందులోనూ, డ్రోన్ల ద్వారా బాంబులు వేయడాన్ని దాటేసి.. డ్రోన్లతో రాకెట్‌లను ప్రయోగించడమంటే.. అది ఆధునిక మిలటరీ పరికరాలు, సాయం లేనిదే సాధ్యం కాదంటున్నారు భద్రతాదళాలు. నిజానికి, ఈ డ్రోన్ల దాడుల గురించి కొన్ని రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉననాయి. గత నవంబర్‌లో ఇంఫాల్ విమానాశ్రయం వద్ద భారీ డ్రోన్ ఒకటి ఎగురుతున్నట్లు గుర్తించారు. దీని కోసం ఏకంగా రాఫెల్ యుద్ధ విమానాన్ని కూడా రంగంలోకి దించారు.అయితే, ఇంత ఆధునిక డ్రోన్లను స్థానికంగా తయారుచేస్తున్నట్లు కూడా అనుమానాలు లేకపోలేదు. ఇటీవల డ్రోన్ల తయారీకి అవసరమైన పరికరాలతో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అసోం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మణిపూర్‌లో తీవ్రవాద బృందాలకు చేరవేయడానికే వాటిని ఆ వ్యక్తి కొనుగోలు చేసాడని పోలీసులు అనుమానించారు. అది జరిగిన కొన్ని రోజులకే? అత్యాధునిక టెక్నాలజీ డ్రోన్‌లకు వాడే బ్యాటరీలతో మణిపూర్‌లోకి ఎంటర్ అయిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ బ్యాటరీలను సినిమా నిర్మాణంలో వినియోగించడానికి తీసుకొస్తున్నట్లు సినీ నిర్మాతల సంఘం వెల్లడిరచింది. అతని అరెస్ట్‌ను ఖండిరచింది. అయితే, ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ మణిపూర్‌లోకి రావడం అల్లర్లలో ఉగ్రవాద శక్తుల ప్రాభల్యాన్ని పెంచుతుందనడానికి సూచనగా పోలీసులు పరిగణిస్తున్నారు. దీని వెనుక బయటి శక్తుల హస్తం కూడా ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.