ప్రణబ్ కుమార్ ముఖర్జీ భారతదేశ రాజకీయ నాయకుడు. ప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతను భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి. ఈయన చేసిన సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించింది. తనకు కోవిడ్`19 వ్యాధి వచ్చినట్లుగా ప్రణబ్ ముఖర్జీ, 2020 అగస్టు 20 న ట్విట్టర్లో ప్రకటించాడు. ఆ తరువాత బాత్‌రూములో జారి పడినందున సైనిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెదడుకు ఆపరేషను జరిగింది. ఆ తరువాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షనుతో 2020 ఆగస్టు 31 న ప్రణబ్ మరణించాడు.