ఓబీసీల చుట్టూ రాజకీయం: విశ్లేషణ
రాజకీయాల్లో కులాలు, మతాలు ఆధారంగా ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం కొత్తేవిూ కాదు. ఈ క్రమంలో దళితులను, గిరిజనులను, ముస్లిం మైనారిటీ వర్గాలను ఓటుబ్యాంకుగా మార్చుకుని కాంగ్రెస్‌ సహా అనేక పార్టీలు గెలుపొందుతూ వచ్చాయి. అల్పసంఖ్యాకంగా ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలు సైతం కొన్ని పార్టీలకు ఓటుబ్యాంకుగా పనికొచ్చాయి. కానీ దేశ జనాభాలో జనాభాలో 50% కంటే ఎక్కువగా ఉన్న ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ)ను మాత్రం ఓటుబ్యాంకుగా మార్చుకోవడంలో ఏ పార్టీ సఫలం కాలేదు. వృత్తుల ఆధారంగా అనేక కులాల సమాహారంగా ఉండడం, రాజకీయ చైతన్యం విషయంలో కులాల మధ్య వ్యత్యాసాలు ఉండడం వంటి కారణాలతో గంపగుత్తగా అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం సాధ్యపడలేదు. చివరకు ఓబీసీ ? మండల్‌ ఉద్యమాలతో రాజకీయాలు చేసిన సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతా దళ్‌ వంటి పార్టీలు సైతం ఓబీసీ వర్గాలన్నింటినీ ఆకట్టుకోలేకపోయాయి. ఓబీసీల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న యాదవ, కుర్బ వంటి సామాజికవర్గాలే ఈ పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి.ఆ ఓటు బ్యాంకుపై ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లుగా విస్మరించిన వెనుకబడిన వర్గాలే ఇప్పుడు అధికారాన్ని సాధించడంలో కీలకంగా మారాయి. 80వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీ ఓటర్లు.. దేశవ్యాప్తంగా 90వ దశకం నుంచి నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ వంటి బీసీ నేతలు దేశ రాజకీయాల్లో ఎదిగారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో కులం ఆధారిత రాజకీయ పార్టీలు సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బీఎస్పీ, జేడీ(యూ) బలోపేతమయ్యాయి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల్గినంత మెజారిటీ సాధించడం వెనుక కూడా ఓబీసీ ఓటుబ్యాంకే కీలకంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తం కావడంతో ఆ ఓటుబ్యాంకు ఆయన వెంట నడిచొచ్చింది. మరోసారి గెలిచేందుకు కూడా ఓబీసీ ఓటుబ్యాంకుపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. గత మూడు, నాలుగు దశాబ్దాల్లో ఓబీసీ ఓటుబ్యాంకుకు మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చిన కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు ఆ వర్గాన్ని దరిచేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఓబీసీ ఓటుబ్యాంకు పైనే కన్నేశాయి.దశాబ్దకాలంగా దేశ రాజకీయాల్లో ఓబీసీల రాజకీయ ప్రాబల్యం పెరిగింది. తదనుగుణంగా ప్రాధాన్యత, ప్రాతినిథ్యం కూడా పెరుగుతోంది. 2014లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అడుగుపెట్టినప్పటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దేశంలో ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఓబీసీ సామాజికవర్గంలో ఆయనకు విశేష ఆదరణ కనిపించింది. తనను అధికారంలోకి తెచ్చిన ఓబీసీలకు ప్రయోజనం కల్పించడం కోసం ప్రధాని మోదీ నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వార్డ్‌ క్లాసెస్‌ (ఎన్సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించారు. పూచీకత్తు అవసరం లేని ముద్ర రుణాల పథకాన్ని ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారు. 2019లో మరోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో చరిత్రలో ఎప్పుడూలేనంత పెద్ద సంఖ్యలో 26 మంది ఓబీసీ నేతలకు చోటు కల్పించారు. చేతి వృత్తులపై ఆధారపడే ఓబీసీ వర్గాలకు చేయూతనిచ్చేందుకు పీఎం`విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చారు. ‘విశ్వకర్మ యోజన’ ద్వారా వడ్రంగులు, కుమ్మరులు, స్వర్ణకారులు, కమ్మరి వంటి చేతివృత్తుల కులాలు, కళాకారులు ప్రయోజనాలు అందుకోనున్నారు. ఈ వర్గాలు రాజకీయాల్లో అత్యంత నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురై ఉన్నారు.ప్రభుత్వపరంగానే కాదు, పార్టీలోనూ ఓబీసీలకు ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా డా. కే. లక్ష్మణ్‌ వంటి విద్యాధికుడికి బాధ్యతలు అప్పగించారు. ఆయనకు బీజేపీలోనే అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా, పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా నియమించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమకు భారీగా భూరి విరాళాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బడాబాబులకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తుంటాయి. బీజేపీ గత పదేళ్లలో సామాజిక సవిూకరణాలకు పెద్దపీట వేస్తూ లక్ష్మణ్‌ వంటి నేతలను రాజ్యసభకు పంపించింది. ‘సబ్‌ కా సాత్‌ ? సబ్‌ కా వికాస్‌ ? సబ్‌ కా విశ్వాస్‌’ నినాదంతో అన్నివర్గాలను కలుపుకుపోతూ ఓబీసీలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓబీసీల ఆదరణతో మరోసారి గెలుపొందాలని భావిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం 2009లో కాంగ్రెస్‌ పార్టీకి 24 శాతం ఓబీసీ ఓట్లు రాగా ఆ ఏడాది బీజేపీకి 22 శాతం ఓబీసీ ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 34 శాతం ఓబీసీ ఓట్లు బీజేపీకి రాగా, కాంగ్రెస్‌కు 15 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2019లో బీజేపీకి ఓబీసీ ఓట్ల శాతం మరింత పెరిగి 44 శాతానికి చేరుకోగా, ఓబీసీ ఓట్లలో కాంగ్రెస్‌కు కేవలం 15 శాతం మాత్రమే వచ్చాయి.80వ దశకం వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతంగానే గెలుచుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, 90వ దశకం నుంచి పతనం వైపు అడుగులు వేసింది. మండల్‌ ఉద్యమం, ఓబీసీల్లో పెరిగిన రాజకీయ చైతన్యం కారణంగా ఆ వర్గాలు కాంగ్రెస్‌కు దూరమై, ప్రాంతీయపార్టీల పరం అయ్యాయి. ఈ లోటును ఆ పార్టీ ఇదివరకు గుర్తించిందో లేదో కానీ ఇప్పుడు రాహుల్‌ గాంధీ ఓబీసీ రాగం అందుకున్నారు. ఓబీసీ జనాభా శాతంపై కచ్చితమైన లెక్కలు లేనప్పటికీ అనేక పెద్ద రాష్ట్రాల్లో 50% మించి జనాభా ఓబీసీలదే అన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. అంత పెద్ద ఓటుబ్యాంకును విస్మరించినా, నిర్లక్ష్యం చేసినా గెలుపు అందుకోవడం సాధ్యం కాదని ఆయన గ్రహించినట్టు కనిపిస్తోంది. 50 శాతం మించిన ఓబీసీలను, 50 శాతం వరకు ఉన్న మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ పావులు కదుపుతున్న వేళ, ఆయన తాజాగా పార్లమెంటులో పాస్‌ చేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ మహిళలకు చోటు లేదన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. అలాగే తాము అధికారంలోకి రాగానే జనగణనలో కులగణన చేపడతామంటూ హావిూలు గుప్పిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ నిర్వహించిన ‘జన్‌ ఆక్రోశ్‌’ యాత్రలో ప్రసంగిస్తూ ఓబీసీలకు రాజ్యాధికారం ఇవ్వడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. ఓబీసీల సంక్షేమం కోసం బీజేపీ సర్కారు చేసిందేవిూ లేదని విమర్శించారు.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న తెలంగాణలోనూ ఓబీసీ ఓట్లే పార్టీల రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఓబీసీలు గంపగుత్తగా ఒకవైపు నిల్చుంటే కచ్చితంగా మిగతా వర్గాల ఓటుబ్యాంకు మొత్తం ఒకవైపుకు తీసుకొచ్చినా సరే ఎదుర్కోవడం సాధ్యపడదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం, ప్రాధాన్యత పెరిగాయి. ఫలితంగా ఓబీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడ్డ తర్వాత క్రమంగా ఆ ఓటుబ్యాంకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)తో పాటు ఇతర పార్టీలకు తరలి వెళ్లింది. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఓబీసీల నుంచి పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ సగం కంటే ఎక్కువ సీట్లు ఎప్పుడూ గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సైతం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ సగం సీట్ల కంటే తక్కువకే పరిమితమైంది. ఇందుక్కారణం ఈ ప్రాంతంలోని ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కు దూరం కావడమే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *