కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోంది: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
న్యూఢల్లీి అక్టోబర్ 3 : చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లపై ఢల్లీి పోలీసుల దాడుల ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. న్యూస్‌క్లిక్ జర్నలిస్ట్‌లపై ఉదయాన్నే దాడులు చేపట్టడం బిహార్‌లో చేపట్టిన కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.బిహార్ కులగణనలో సంచలన వివరాలు వెలుగుచూడటం, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో జర్నలిస్టులపై దాడులకు తెగబడి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలకు తెరలేపిందని పేర్కొన్నారు. కేంద్ర పాలకుల ముందు ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా వారు తప్పించుకునే ధోరణినే ఆశ్రయిస్తారని ట్విట్టర్ వేదికగా పవన్ ఖేరా ఎద్దేవా చేశారు.ఆగస్ట్ 17న ఉగ్రవాద వ్యతిరేక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణ చట్టం (యూఏపీఏ) కింద ఆగస్ట్ 17న నమోదైన కేసు ఆధారంగా ఢల్లీి పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం ఉదయం ఢల్లీి, నోయిడా, ఘజియాబాద్‌లోని 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా పోలీసులు వీరి నుంచి ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌ల డేటా డంప్స్ సహా ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవచ్చని ఈడీ సమాచారం చేరవేసిన నేపధ్యంలో ఈ సోదాలు చేపట్టారు.