కోల్‌కతా మార్చ్ 7: పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీపై ప్రదాని మోదీకి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా దీదీ గురువారం మహిళా మద్దతుదారులకు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఎంసీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తలో నిలిచిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు పాల్గొన్నారు.మహిళల హక్కులు, మా నిబద్ధత అనే నినాదంతో ర్యాలీ కొనసాగుతోంది. ర్యాలీలో దీదీ ముందు నడుస్తుండగా.. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె వెనకే ఉన్నారు.మమతా మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘‘బెంగాల్‌లో మహిళలను హింసిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను సవాలు చేయగలను. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు, ప్రధాని మోదీ ఎక్కడ ఉన్నారు? విూరు బిల్కిస్ బానోని మరచిపోయారా?. కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజ్త్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరారు. అలాంటి వారి నుంచి న్యాయం ఎలా ఆశించగలం’’ అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మమతా ఏటా మహిళా మార్చ్‌కు నాయకత్వం వహిస్తారు. శివరాత్రి పండగ కారణంగా ఈ ఏడాది ఒకరోజు ముందుగానే ర్యాలీ నిర్వహించారు.
మోదీ ఏమన్నారంట: నారీశక్తితో బెంగాల్లోని మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక టీఎంసీ పతనం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. నదీతీర ద్వీపం సందేశ్‌ఖాలీలో ఆ పార్టీ నేతల అఘాయిత్యాలు రాష్ట్రంలో, దేశంలో మహిళలను ఆగ్రహోదగ్రులను చేసిందని.. బెంగాల్‌వ్యాప్తంగా ఆవరించిన ఈ తుఫాన్ ధాటికి టీఎంసీ అంతరిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కోల్‌కతాలో హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బారాసాత్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.