చెన్నై, ఫిబ్రవరి 28: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో పర్యటించిన ప్రధాని మోదీ.. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించిందంటూ ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఘనతను చైనాకు కట్టబెట్టడం చాలా విచారకరమని, ఇది దేశ ప్రజలకు, తమిళనాడు ప్రజలకు ద్రోహం చేయడమేనని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఫొటోలో చైనా జెండాను పాతి దేశానికి నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఈ చర్య మన శాస్త్రవేత్తలను అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తంచేశారు.ప్రధాని మోదీ.. తన పర్యటన సందర్భంగా తూత్తుకుడిలో స్వదేశీ హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే జలమార్గ నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇక్కడ రూ.17 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.డీఎంకే ఏ పనీ చేయని పార్టీ అని, తప్పుడు క్రెడిట్‌ తీసుకునేందుకు ముందుందంటూ ప్రధాని మోదీ విమర్శించారు. కేంద్ర పథకాలపై స్టిక్కర్లు వేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసే పని ఈ పార్టీ చేసిందన్నారు. తమిళనాడులోని ఇస్రో లాంచ్‌ప్యాడ్‌కు సంబంధించి చైనా స్టిక్కర్లను అతికించి డీఎంకే భారతీయ శాస్త్రవేత్తలను అవమానించిందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. డిఎంకె అనేది అంతరిక్షంలో భారతదేశం పురోగతిని సహించటానికి సిద్ధంగా లేని పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అంతరిక్షంలో భారత్‌ పురోగతిని చూడడం వారికి ఇష్టం లేదని.. అందుకే అలా చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.తిరునెల్వేలిలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. విూరు అనవసర హడావుడి చేసి.. ఇలాంటి తప్పుడు ప్రకటనలకే ఖర్చు పెడుతున్నారని అన్నారు. డిఎంకె కార్యకర్తలు భారతదేశ అంతరిక్ష విజయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరుకోవడం లేదని, అందుకే చైనా జెండాలను ఉపయోగించారంటూ ప్రధాని అన్నారు. దీనితో పాటు డీఎంకేను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *