ఏలూరు, సెప్టెంబర్‌ 26: ఒకప్పుడు గ్రామానికి ఆర్టీసీ బస్సు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించేది. ఇపుడు బస్సులు వస్తున్నా వాటిని ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. గ్రామాల వీధుల్లోకి సైతం వెళ్లి ప్యాసింజర్లను ఎక్కించుకోవటం, దింపడం వంటివి ఆటోల నిర్వాహకులు చేస్తుండటంతో స్ధానికులు ఎక్కువగా లోకల్‌ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు యువత ఎవరికి వారు ఆటోలను తమ ఉపాధి అవకాశంగా మార్చుకోవటం, తమ ఊరి వాడనే ఫీలింగ్‌ ప్రయాణికుల్లో కలగడంతో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఆటోల్లోనే ఎక్కువగా ప్రయాణాలు సాగుతున్నాయి. దీంతో ఆర్టీసీ నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి అనివార్యం అయింది. దీంతో తొలుత కార్గో సేవలను మొదలు పెట్టిన ఆర్టీసీ వాటిని విజయవంతంగా నడుపుతోంది. ఇపుడు తీర్థయాత్రల పైనా ప్రత్యేక దృష్టి సారించింది ఏపీఎస్‌ ఆర్టీసీతీర్థయాత్రలు అంటే దూరప్రాంతాలు మాత్రమే కాదు. ముఖ్యంగా టెంపుల్‌ టూరిజంలో భాగంగా శైవక్షేత్రాలు, శక్తి పీఠాలు ఇలా ఆలయాన్ని ఆలయాన్ని లింక్‌ చేసుకుంటూ నూతన సేవలు ప్రారంభించింది. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడుపుతుంది. ఏలూరు జిల్లా పరిధిలో మూడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. అవి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలు. మూడు డిపోల పరిధిలో 300 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అందులో 213 ఆర్టీసీకి చెందిన బస్సులు కాగా, 87 అద్దె బస్సులు ఉన్నాయి. జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు, తీర్థయాత్రల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అదేవిధంగా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల నుంచి వాడపల్లికి, ద్వారకా తిరుమలకు శనివారం నాడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.ఇక తీర్థయాత్రలలో భాగంగా ప్రతి నెల పౌర్ణమి రోజు తమిళనాడులో ఉన్న అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. అయితే ఆ బస్సు ముందుగా అరుణాచల క్షేత్రానికి వెళ్లి, భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో పెద్ద తిరుపతి వెళుతుంది. అక్కడ భక్తులు మొక్కులు ముగించుకున్న అనంతరం తిరిగి గమ్యస్థానాలకు భక్తులను సురక్షితంగా చేర్చుతున్నారు. అయితే ఈ అరుణాచల క్షేత్రానికి ఏర్పాటుచేసిన బస్సు సర్వీస్కు మంచి స్పందన వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *