హైదరాబాద్ అక్టోబర్ 25: ఇన్నాళ్ళు పెద్దమొత్తంలో మానవ మరణాలకు యుద్దాలు, ప్రకృతి విపత్తులు కారణం అయ్యేవి. దేశాల మధ్య యుద్ధాలు, వరదలు, సునావిూలు, భూకంపాలు మొదలైనవాటివల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువశాతం మంది కేవలం అనారోగ్యం కారణంగా మరణిస్తున్నారు. ఇప్పుడు వైద్యశాస్త్ర పరిశోధకులు మరొక షాకింగ్ విషయం బయటపెట్టారు. కేవలం ఒకే ఒక్క జబ్బు కారణంగా ప్రపంచంలో ఏడాదికి కోటిమంది మరణిస్తారని చెబుతున్నారు. అంతేకాదు 2050సంవత్సరానికి జరిగేదేంటో వారే వివరించారు. ప్రపంచాన్ని కలవపెడుతున్న ఈ విషయం .మెదడులో కొంతభాగానికి రక్తసరఫరా జరగడంలో అంతరాయం ఏర్పడటం లేదా రక్తసరఫరా తగ్గడం వల్ల మెదడు కణజాలానికి ఆక్సిజన్ సరఫరా కూడా లోపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నడవడం, మాట్లాడటం, ఇతరులు చెప్పేవిషయాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగడం, ముఖం, చేయి, కాలు మొదలైన ప్రాంతాలలో పక్షవాతం, తిమ్మిరి మొదలైనవి స్ట్రోక్ వల్ల సంభవిస్తాయి. 2050 నాటికి స్ట్రోక్ కారణంగా 86నుండి 91శాతం మరణాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 1990 నుండి 2020 వరకు మధ్యకాలాన్ని పరిశీలిస్తే స్ట్రోక్ రోగుల సంఖ్య 70 శాతం పెరిగింది. 70ఏళ్లకంటే తక్కువ వయసున్నవారిలో స్ట్రోక్ కేసులు 20 శాతం పెరిగాయి. 1.25 కోట్ల స్ట్రోక్ కేసులు కొత్తగా గుర్తించారు. 10కోట్లమందికి పైగా ప్రజలు స్ట్రోక్ సమస్యతో జీవిస్తున్నారు. ఇది ఇన్నాళ్లు వృద్ధులలో సంభవించే సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు చిన్నవయసువారిలో కూడా స్ట్రోక్ వస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
స్ట్రోక్ రావడానికి కారణాలు.
అధికరక్తపోటు స్ట్రోక్ కు ప్రధాన కారణం అవుతుంది. అధికరక్తపోటు కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడతాయి. మెదడు గుండె నాళాలవిూద ప్రభావం చూపుతుంది. దీనికారణంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తసరఫరాలో అడ్డంకి ఏర్పడటం జరుగుతుంది. అలాగే గుండె కొట్టుకునే తీరు సరిగా లేకున్నా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడుకు వెళ్ళే రక్తనాళాల అడ్డంకికి దారి తీస్తుంది.అధికబరువు ఉన్నవారు కూడా స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. శారీరక శ్రమ లేని జీవనశైలి అధికబరువుకు తద్వారా స్ట్రోక్ కు దారితీస్తుంది. వారంలో 4`5 రోజులు, రోజూ నిమిషాల శారీరక శ్రమతో పాటు సాధారణ 30`40 వ్యాయామాలు చెయ్యాలి. మధుమేహం అదుపులో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం, పరిసరాలు అధిక కాలుష్యం కూడా స్ట్రోక్ కు కారణమవుతాయి.
స్ట్రోక్ రాకూడదంటే..
తక్కువ ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్స్, బేకింగ్ ఫుడ్స్ మానేయాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఫాలో అవ్వాలి.