విశాఖపట్టణం, అక్టోబరు 16: ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోఈనెల 26 నుంచి వచ్చే నెల 9 వరకూ మొదటి దశలో సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభిం చేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు విశాఖలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లా నుంచి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ ర్యంలో ఈ యాత్రకు సంబంధించి ప్రణాళికపై చర్చించారు. సామాజిక బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 26న జిల్లాలోని ఇచ్చాపురం నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అప్పటి వరకూ ప్రజల్లో నిరంతరం ఉండాలన్న లక్ష్యం మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 26న ప్రారంభించే యాత్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొనసాగించేందుకు నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో ఈనెల 26 నుంచి వచ్చేనెల 9 వరకూ అంటే 13 రోజులుపాటు వైసీపీ ముఖ్యనేతలంతా బస్సు యాత్రలో పాల్గొంటారు. ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర ఈనెల 26న ఇచ్ఛాపురంలో ప్రారంభం కానుంది. 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆమదాలవలస, నవంబరు 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న ఎస్.కోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లి విూదుగా సాగనుంది.
దసరాకు తరలింపు లేనట్టే:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు మాకం మార్చడం ఆలస్యం కానుంది. విజయదశమికి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారని.. అక్కడి నుంచే పాలన చేస్తారని గతంలో వైసీపీ నేతలు ప్రకటించారు.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాకకోసం వికేంద్రీకరణ జేఏసీ కూడా విశాఖపట్నంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని సమావేశం కూడా పెట్టుకుంది. దసరా శరన్నవరాత్రుల చివర్లో అంటే అక్టోబర్ 23న సీఎం క్యాంపు కార్యాలయం లో గృహప్రవేశం చేసి 24 వ తేదీనుంచి అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కూడా చెప్పారు. దీంతో ఇక దసరాకు అమరావతి నుంచి విశాఖపట్నంకు సీఎం షిఫ్ట్ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. తాజా పరిస్థితులతో సీఎం విశాఖ నుంచి పాలన చేయడం మరింత ఆలస్యం అవుతుందని తెలిసింది. సీఎం కార్యాలయ సిబ్బందితో పాటు సీఎస్, మంత్రులు,కార్యదర్శులకు అవసరమైన వసతి చూసిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో మకాం వేస్తారని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ భవనం నిర్మాణంతో పాటు ఇతర వసతులు చూసేందుకు మరో నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన చేస్తారని అధికారులు చెబుతున్నారు. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ లో సీఎం జగన్ అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది.