విజయవాడ, అక్టోబరు 16: ఎన్నికల సవిూపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోంది. కులగణనకు కూడా శ్రీకారం చుడుతోంది. కులగణన.. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలని పలు పార్టీలు, సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రాష్ట్రం కులగణన చేయాలని నిర్ణయించుకుంది. నవంబర్‌ 15 తర్వాత రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జగన్‌ సర్కార్‌. నవంబర్‌ 15 తర్వాత రాష్ట్రమంతటా ఈ సర్వే మొదలుపెట్టేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ద్వారా ఈ సర్వే చేపడతారు. సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటి వివరాలు సేకరిస్తారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో.. వాలంటీర్లను కులగణలో భాగస్వామ్యులను చేయడం లేదని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఈ సర్వేలో పాల్గొంటారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. దీని కోసం ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. కులగణన పారదర్శకంగా జరగాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. అందుకోసం మూడు స్థాయిల్లో పునఃపరిశీలన జరిగేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరించిన వివరాలను మండలస్థాయిలో అధికారులు రీవెరిఫికేషన్‌ చేస్తారు. సచివాలయ పరిధిలోని 10 శాతం చొప్పున ఇళ్లల్లో ఈ రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. ద్వితియస్థాయిలో రీ వెరిఫికేషన్‌ బాధ్యతలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉద్యోగులకు అప్పటించింది జగన్‌ సర్కార్‌. ఇక.. మూడో స్థాయిలో.. కింది స్థాయిలో జరిగిన సర్వేపై ఆర్‌డీవో ఆధ్వర్యంలో వెరిఫికేషన్‌ ఉంటుంది.కులగణన కోసం ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న యాప్‌ ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కులగణన అమల్లో ఉంది. బిహార్‌ ప్రభుత్వం మొదటగా దీన్ని చేపట్టింది. ఆ తర్వాత పంజాబ్‌, ఒడిశా ప్రభుత్వాలు కూడా కులాల వారీగా సర్వే చేపట్టాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఆ జాబితాలో చేరుతోంది. నవంబర్‌ 15 కంటే ముంద.. రాష్ట్రంలోని కుల సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం.ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *