విజయవాడ: రిమాండ్‌లో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర రాజమహేంద్రవరం జైల్లో జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణం ఆయన్ను బయటి ఆస్పత్రులకు తరలించి.. ఉత్తమ చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై ఆందోళనకర సమాచారం వ్యాప్తిలోకి రావడంతో ఆ పార్టీ ముఖ్య నేతలు కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, ధూళిపాళ్ల నరేంద్ర, పంచుమర్తి అనూరాధ, బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యాలరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు మోపి అక్రమంగా అరెస్టు చేశారు. 34 రోజులుగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కళావెంకట్రావు అన్నారు.రిమాండ్‌లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని,డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని చెప్పారు.