తాడేపల్లిగూడెం:  అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో నడిచే ఆసుపత్రులు (హాస్పిటల్‌ ఆన్‌ వీల్స్‌)గానిర్వహిస్తున్నామని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం పీహెచ్‌ సి ఆవరణలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. దీనికి రాజమండ్రి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రికి చెందిన రెండు మొబైల్‌ మెడికల్‌ ఎక్విప్మెంట్‌ యూనిట్లను (రెండు బస్సులు) రప్పించారు. వీటిలో అవసరమైన అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మంత్రి కొట్టు ప్రత్యేక చొరవ తీసుకుని జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు తో మాట్లాడి నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకించి ఈ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మహా సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు.
రెండు నెలలపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముందుగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి ఆరోగ్యంపై సర్వే నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత వాలంటీరు, ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఏడు రకాల పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి టోకెన్లు అందజేస్తారన్నారు.  మన నియోజకవర్గంలో ఖర్చుకు వెనకాడకుండా తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైతే సొంత డబ్బు ఖర్చు పెట్టి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పూర్తిస్థాయి ఆధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు మెడికల్‌ ఎక్విప్మెంట్‌ మొబైల్‌ యూనిట్లను రప్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో ఇలాంటి మెగా మెడికల్‌ క్యాంపు ఒకటి నిర్వహించామని, ఇది రెండవది అన్నారు. మూడవదిగా ఈనెల 14వ తేదీ శనివారం పెంటపాడు మండలం లోని గ్రామాల ప్రజలకు సంబంధించి పెంటపాడు ఎస్‌ టి వి ఎన్‌ హైస్కూల్లో ఇదే తరహాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించబోతున్నట్లు మంత్రి కొట్టు ప్రకటించారు. అత్యంత ఖరీదైన గుండె, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనివలన మనకు తెలియకుండానే మన శరీరంలో దాగి ఉన్న వివిధ రకాల వ్యాధులను ముందుగానే కనుగొని మందుల ద్వారా నయం చేసుకోవచ్చు అన్నారు.
నిర్లక్ష్యం చేస్తే శరీరంలో వ్యాధి ముదిరిపోయి ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఉంటుంది అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శిబిరాలకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పోలిమోను నాగ అంజుష, యూత్‌ లీడర్‌ కొట్టు విశాల్‌, తాడేపల్లిగూడెం జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషులత, విజయవాడ కనకదుర్గమ్మ గుడి ట్రస్ట్‌ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్‌ రావు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ ముప్పిడి సంపత్‌ కుమార్‌, కొమ్ముగూడెం సొసైటీ డైరెక్టర్‌ పత్స అంజిబాబు, జగ్గన్నపేట గ్రామ సర్పంచ్‌ ములకల సూర్యరావు, మండల యూత్‌ ప్రెసిడెంట్‌ ములకల రాంబాబు, మండల మహిళా ప్రెసిడెంట్‌ నూనె రాధ, వెంకట్రామన్నగూడెం గ్రామ వైకాపా నాయకులు పోలిమోను శ్రీనివాసరావు, ఎంపీడీవో విశ్వనాధ్‌, తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనపర్తి శామ్యూల్‌, వి ఆర్‌ గూడెం పి హెచ్‌ సి డాక్టర్‌ శ్రీ హర్ష, ఇంకా పలువురు డాక్టర్లు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, మదర్‌ వన్నిని నర్సింగ్‌ విద్యార్థినులు, జిఎస్‌ఎల్‌, యూనియన్‌ హాస్పిటల్స్‌ కు చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *