పోలీస్ శాఖలో అక్రమాలకు పాల్పడే వారిపై జిల్లా ఎస్.పి సీరియస్
పులివెందుల అర్బన్ పి.ఎస్ లో బలవంతపు వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్, హోం గార్డులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విధుల నుండి సస్పెండ్ చేసిన జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు
అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదు..కఠిన చర్యలు తప్పవని సిబ్బందికి వార్నింగ్
కడప అక్టోబర్ 13: పోలీస్ శాఖలో అక్రమాలకు, అవినీతికి పాల్పడే సిబ్బందిపై జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ కొరడా ఝళిపిస్తున్నారు. తప్పులు చేసే వారిని వదిలే ప్రసక్తే లేదని కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ బి. నరసింహారెడ్డి (PC 2737), హోం గార్డ్ జి.రవికుమార్ (HG 600) లపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో 484/2023 గా క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ ఓ వ్యక్తి ని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారించి వాస్తవం అని నిర్ధారణ కావడంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారిరువురిని విధుల నుండి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణకు మారు పేరైన పోలీస్ శాఖలో సత్ప్రవర్తన తో విధులు నిర్వహించాలని, ఏ మాత్రం విధుల్లో అలసత్వం వహించినా, అక్రమ వ్యవహారాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ హెచ్చరించారు.