విజయవాడ, అక్టోబరు 11: రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పని చేస్తున్నారు. వరుస కార్యక్రమాలతో పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఆరు నెలలు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఇళ్లకు పరిమితం కావొద్దని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 52 నెలల పాటు సువర్ణాక్షరాలతో లిఖించదగిన పాలన అందించామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. మార్చి లేదా ఏప్రిల్‌లో అసెంబ్లీ ఉంటాయంటూనే, అలసత్వం వహించవద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి సానుకూలంగా పవనాలు ఉన్నాయని, వై నాట్ 175 అన్న టార్గెట్‌తోనే నేతలంతా పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల వద్దకు వెళ్లి పార్టీ కార్యక్రమాలు వివరించేలా కొత్త ప్రణాలికలు సిద్ధం చేశారు. 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు, జగనన్న సురక్షా, వై ఏపీ నీడ్స్, ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రజాప్రతినిధులంతా ప్రజలతో మమేకం అయ్యేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, ఆరోగ్యశ్రీ, చేయూత పథకాల కింద ప్రభుత్వం అందించిన సాయంపైనా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనుంది వైసీపీ. ఎవరికైనా ఆరోగ్యం సరిగాలేకపోతే వారి ఆరోగ్యం కుదుటపడే వరకు అండగా ఉంటామని ప్రజాప్రతినిధులు హావిూ ఇవ్వనున్నారు. ఎన్నికల సవిూపిస్తున్న ప్రజలకు ఎంత చేరువైతే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు సీఎం జగన్. జగనన్న సురక్షా కార్యక్రమం ముగిసిన తర్వాత మూడు ప్రాంతాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు బస్సుయాత్ర చేపట్టనున్నారు. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లోనూ సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. బస్సు యాత్రలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలకు వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి, నిధుల కేటాయింపులను బస్సుయాత్రల్లో ఎమ్మెల్యేలు వివరించనున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసిన జగన్, అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రెడీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను భాగస్వామ్యం చేసేలా వినూత్న కార్యక్రమానికి జగన్ శ్రీకారచుట్టబోతున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ స్థాయి నుంచి ఆటల పోటీల నిర్వహించనుంది. రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనుంది. గ్రావిూన ప్రాంతాల్లోని యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం అని పైకి చెబుతున్నా, యువత ఓట్లను కొల్లగొట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యం తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యువతే కీలకం కావడంతో ఇప్పటి నుంచే వారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.