విజయవాడ, అక్టోబరు 11: ఏపీలో కమలనాధులు ఆలోచనలో పడ్డారా? కేంద్ర నాయకత్వం పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారా? పొత్తు ఉంటుందా? లేదా? అని తేల్చి చెప్పాలని బిజెపి అగ్రనాయకత్వాన్ని కోరుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢల్లీి వెళ్లడం అందుకేనని తెలుస్తోంది. కొద్దిరోజులు కిందట విజయవాడలో బిజెపి కోర్ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. తన భాగస్వామ్య పక్షమైన జనసేన టిడిపి తో వెళ్లడాన్ని సమావేశంలో చర్చించారు. టిడిపి, జనసేన తో కలిసి నడవడం శ్రేయస్కరమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.ఏపీలో ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్లాలా? లేకుంటే ఒంటరి పోరుకు సిద్ధం కావాలా? అన్నది బిజెపి ఆగ్రనేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే పురందేశ్వరికి హుటాహుటిన ఢల్లీి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. పొత్తుతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సైతం పురందేశ్వరి కలుస్తారని సమాచారం.తాజా రాజకీయ పరిణామాలతో కేంద్ర పెద్దలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టిడిపి తో కలిసే ప్రసక్తి లేదని.. జనసేనతో మాత్రమే తమ నడుస్తామని చెప్పుకొచ్చేవారు. అయితే పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. పురందేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నాక టిడిపి పై సానుకూలంగా ఉన్నారు.పొత్తు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు.అదే సమయంలో చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర పెద్దల హస్తము ఉందని వైసీపీ సంకేతాలు ఇవ్వడం పైన బీజేపీ అగ్ర నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.అటు పురందేశ్వరి ఏపీ రాగానే.. ఇటు పవన్ ఢల్లీి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై కేంద్ర పెద్దలను ఒప్పించడానికి ఆయన ఢల్లీి పయనం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.జగన్ ఢల్లీి పర్యటనలో ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సైతం పొత్తుకు సానుకూల పరిణామంగా వార్తలు వస్తున్నాయి.అటు పవన్, ఇటు పురందేశ్వరి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడంతో బిజెపి పొ త్తుల దారిలోకి వస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.