ప్రమాదం జరిగి 4 నెలలైంది…
మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు
ఒడిశా అక్టోబర్‌ 9: భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్‌ 2వ తేదీన బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ కు తరలించారు. అయితే, వాటిలో ఇప్పటికీ 28 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి.ఆ మృతదేహాలకు సంబంధించిన వారు ఇప్పటి ఎవరూ రాలేదు. దీంతో అధికారులే ఆ 28 డెడ్‌బాడీస్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు 28 గుర్తుతెలియని మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు. సీబీఐ అధికారుల సమక్షంలో మృతదేహాలను కార్పొరేషన్‌కు అప్పగిస్తామని.. వాటికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఎమ్‌సీ మేయర్‌ సులోచన దాస్‌ తెలిపారు.రాష్ట్ర, కేంద్రం, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ల ప్రస్తుత నియమాలు, మార్గదర్శకాలను అనుసరించి భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అధికారికంగా మృతదేహాలను దహన సంస్కారాల కోసం బీఎమ్‌సీ ఆరోగ్య అధికారికి అప్పగిస్తారని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నట్లు వివరించారు.కాగా, రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత 162 మృతదేహాలను భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు తరలించారు. అందులో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మరో 53 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే, మరో 28 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని తెలిపారు. ఆ మృతదేహాలను డీప్‌ ఫ్రీజర్‌ కంటైనర్లలో భద్రపరిచారు. అయితే, వారి కోసం ఇప్పటి వరకూ ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *