రాయచోటి – అన్నమయ్య జిల్లా

రాయచోటి జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

రాయచోటి, అక్టోబర్ – 7: రాయచోటి జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్, ప్రభుత్వ విప్ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, స్థానిక   సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం రాయచోటిలో మండలం దిగువ అబ్బవరం గ్రామపంచాయతీ నక్కలవాండ్లపల్లి వద్ద 32.62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ అభివృద్ధి పనులను, మాసాపేట శెట్టివాండ్లపల్లి వద్ద 40 ఎకరాల విస్తీర్ణం 2.25 చదరపు అడుగులలో నిర్మాణం చేయనున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, కలెక్టరేట్ వెనకవైపున నిర్మాణం తలపెట్టిన కలెక్టర్, జెసి, డిఆర్ఓ బంగ్లాల ప్రదేశాలలో కలెక్టరు, ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించారు.

మొదట క్రికెట్ స్టేడియం ల్యాండ్ స్కేపింగ్ పనులు, భవన నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణం, స్టేడియం సరిహద్దుల చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం ఏర్పాటు తదితరాలపై పరిశీలించి రెవిన్యూ, ఆర్అండ్బి, మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో క్రికెట్ స్టేడియం రావడం వల్ల భూమి ధరలు పెరుగుతాయని… ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలు గురి కాకుండా తగు రక్షణ ఏర్పాటు చేయాలని రాయచోటి తాసిల్దారును ఆదేశించారు. అలాగే క్రికెట్ స్టేడియం అభివృద్ధి వేగవంతం చేయాలని, త్వరితగతిన నాణ్యతగా పనులు పూర్తి చేయాలని, స్టేడియం చుట్టూ మరియు స్టేడియం రోడ్డు కిరువైపులా చెట్లు నాటే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మాసాపేట శెట్టివాండ్లపల్లి వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ ప్రాంతాన్ని, మ్యాపులను పరిశీలించారు. ప్రధాన రోడ్డు నుంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వరకు ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసి 100 అడుగుల రోడ్డును నిర్మించాలని రెవెన్యూ మరియు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతంలో దూరంలో 15 ఎకరాలలో ఎస్పీ కార్యాలయం కూడా నిర్మించడం జరుగుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ ప్రాంతం సరిహద్దులు చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళను పాతి పేర్లు రాయించాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టరేట్ వెనకవైపున కలెక్టర్, జెసి మరియు డిఆర్ఓ బంగ్లా నిర్మాణాలు తలపెట్టిన ప్రాంతంలో చేస్తున్న భూమి అభివృద్ధి పనులను మరియు మ్యాపులను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ… రెవిన్యూ, ఆర్అండ్బి, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు నిధుల పరంగా ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయుటకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చేపట్టిన పనులను నాణ్యతగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, ఆర్ అండ్ బి జిల్లా అధికారి సహదేవరెడ్డి, మునిసిపల్ కమిషనర్ గంగప్రసాద్, తాసిల్దారు హేమంతకుమార్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *