`సర్వమత సమ్మేళనానికి తొలిసారిగా హాజరైన స్వామి వివేకానందు
1893లో చికాగో వేదికగా జరిగిన సర్వమత సమ్మేళనానికి తొలిసారిగా హాజరైన స్వామి వివేకానందుడు.. ఒక్క మాటతోనే ప్రపంచాన్ని భారతవైపు తిప్పుకునేలా చేశారు. చికాగోలో సర్వమత సమ్మేళనం 1893, సెప్టెంబరు 11న ప్రారంభమైంది. ఈ మహాసభకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు హజరయ్యారు. వీరందరిలో కెల్లా భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద పిన్న వయస్కుడు. ఈ సమ్మేళనానికి హాజరైన వారంత తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు. అయితే స్వామిజీ దగ్గర అలాంటిదేమి లేదు. అందుకే తన ప్రసంగాన్ని చివరలో ఉంచమని సభాధ్యక్షుడికి విఙ్ఞప్తి చేశారు. అయితే వివేకానందుడు దాదాపు రెండు నెల ముందే అమెరికా చేరుకున్నారు.స్వామిజీ చికాగో నగరానికి జూలైలోనే చేరుకొన్నారు. కానీ విశ్వమత సభలు సెప్టెంబరులో ప్రారంభమవుతాయని, ఆ సభల్లో పాల్గొనడానికి ధ్రువ ప్రత్రాలు తప్పనిసరి అని, అవి ఉన్నా వక్తలను అనుమతించే సమయం ఎప్పుడో దాటి పోయిందని తెలిసి బాధపడ్డారు. అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. బోస్టన్ నగరంలో ఖర్చు తక్కువని ఎవరో చెప్పగా విని అక్కడకు రైలులో వెళ్లారు . బోస్టన్ చేరుకున్న వివేకానందుడికి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేహెచ్ రైట్స్‌తో పరిచయం ఏర్పడిరది. విశ్వమత సభలో పాల్గొనడానికి తనకు అనుమతి పత్రం కావాలని స్వామిజీ ఆ ప్రొఫెసర్‌ను అడిగితే… మిమ్మల్ని ధ్రువపత్రం అడగడమంటే ‘‘సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే’’ అని చెప్పి ‘‘ఈ వ్యక్తి మేధస్సు, పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులను అందరిని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా చాలా గొప్పదని అందులో రాశారు.అమెరికా సోదర సోదరీ మణులారా.. అని స్వావిూ వివేకానంద తన ప్రసంగాన్ని ప్రారంభించగానే దాదాపు మూడు నిమిషాల పాటు కరతాల ధ్వనులతో ప్రాంగణం దద్దరిల్లింది. వివేకానందుడి ప్రేమ పూర్వక పిలుపునకు సభికులు దాసోహం అన్నారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని, చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలో చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుడిని చేరుకోవడమేని అన్నారు. దీని కోసం ఎవరూ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని, తమ మతం మాత్రమే గొప్పదని భావించే వారు బావిలో కప్పల లాంటి వారని వ్యాఖ్యానించారు. ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో స్వామిజీ గొప్పదనమే కాదు, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. ఫోటోతో పాటు స్వామి వివేకానంద `ది సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పోస్టర్స్ ముద్రించి చికాగో నగరంలో వేలాడదీశారు. ఇది జరిగి నేటికి 131ఏళ్లు పూర్తయింది.