ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టుపేర్కొంది. ఎన్నికల చట్టాలప్రకారం మేనిఫెస్టోలోని పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్నికల వేళ మేనిఫెస్టో ప్రకటించడం అవినీతి చేయడంతో సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. జస్టిస్‌ సూర్యకాంత్‌ జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌ లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ వాదన విచిత్రంగా ఉందని అభిప్రాయపడిరది. తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చామరాజనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీజెడ్‌ జవిూర్‌ అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో అనేక హావిూలు ప్రకటించింది. దీనిపై శశాకం జె శ్రీధర అనే వ్యక్తి స్థానిక హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు హావిూలు అవినీతి కిందకే వస్తాయని పిటిషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన జవిూర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ శశాంక శ్రీధర్‌ హైకోర్టును ఆశ్రయించారు.రాజకీయ పార్టీలు అధికారం చేపట్టేందుకు అలవిగాని హావిూలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. వీటి కారణంగా ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇష్టారీతిన మేనిఫెస్టోలు, హావిూలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని విస్మరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలు కూడా అవినీతికి కిందకే వస్తాయని, వీటిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.జరిపిన కర్ణాటక హైకోర్టు పిటిషనర్‌ వాదనలను తోసిపుచ్చింది. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 కింద మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని తెలిపింది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శశాంక దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీల మేనిఫెస్టోల్లోని హావిూలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని ప్రశ్నించింది. మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలను విడుదల చేయడం చట్టబద్ధమైనప్పటికీ వాటి అమలుకు నైతిక బాధ్యత వహించవలసిన అవసరం పార్టీలకు ఉండడం లేదు. అలవికాని హావిూలు ఇవ్వడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, గెలిచాక నిలబెట్టుకోలేక పోవడం రివాజుగా మారింది. తమిళనాడులో ఉచిత చీరలు, ప్రెషర్‌ కుక్కర్లు, వాషింగ్‌ మిషన్లు, టెలివిజన్లతో ప్రారంభమైన ‘రేబిడీ సంస్కృతి’ నేడు దేశం అంతా విస్తరించింది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉచిత వాగ్దానాలకు బాగా అలవాటు పడ్డాయి. ఉచిత కరెంటు, గ్యాస్‌ సిలిండర్లు, టికెట్‌ లేని బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, స్కూటీలు, లాప్టాప్‌ లు, తాళిబొట్లు, పెళ్లికి సహాయం, తదితర పేర్లతో ఓటర్లను ప్రలోభపెడుతున్న పార్టీలు ఆర్థికవ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలు నేడు ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను చెరిపివేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి ప్రజలకు రోజువారి కనీస సదుపాయాలు రాయితీ ధరతో సులభంగా పొందేందుకు ఇచ్చే సంక్షేమ పథకాలను, ఎలాంటి హేతుబద్ధత లేకుండా విలాసాలను కూడా అవసరాలుగా భ్రమింపజేస్తూ ఉచితంగా ఇస్తూ అవి సంక్షేమ పథకాలుగా పార్టీలు చెబుతున్నాయి. అధికారమే పరమావధిగా సరికొత్త ఉచిత హావిూలు ఇవ్వడంలో పార్టీలు తమలో తామే పోటీపడుతున్నాయి. ఉచితాలు నిష్పక్షపాత ఎన్నికలు అనే భావనకు విఘాతంగా మారుతున్నాయి. ప్రజల డబ్బుని ఎగురవేసి ఓట్లు సంపాదించే మార్గాలుగా పార్టీలు ఉచితాలను తీర్చిదిద్దుతున్నాయి. ఉచిత విద్యుత్తు, ఉచిత రవాణా లాంటి దారి తెన్నులేని, ప్రణాళిక లేని పథకాలు ఆయా సంస్థలను నిర్వీర్యం చేసి మొత్తంగా మూసివేతకు దారి తీయవచ్చు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు రుణ భారం పెరిగి ప్రాధాన్య రంగాలపై తగిన నిధులను వెచ్చించలేకపోతున్నాయి. బడ్జెట్‌ పై ఒత్తిడి పెరగటం, విద్య, ఆరోగ్య రంగాలకు నిధుల కొరత, దేశ స్థూల ఉత్పత్తి సామర్థ్యం, ఆర్థిక సమతుల్యం దెబ్బ తినటం, వాంఛనీయం కాని వస్తు సేవల వినియోగం పెరగటం, వంటి నష్టాలు కలుగుతాయి. సంక్షేమం పేరుతో బడ్జెట్‌ లో సింహం భాగం ఖర్చు చేయడం వల్ల సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధి, ఆధునికీకరణ జరగకపోవడం, సమాజం వెనుకబాటుకు గురికావడం జరుగుతుంది. ఉచితాలపై కమిటీ వేయాలి మేనిఫెస్టోలోని హావిూలతో వనరుల వివరాల సమర్పణ తప్పనిసరి చేయడమే గాక, అమలు చేయని పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. ఉచితానుచితాలను నిర్ణయించేలా, ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను గుర్తించేందుకు నిపుణుల కమిటీని నియమించాలి. రుణ భారం పెంచే ఆర్థికవృద్ధిని నష్టపరిచే ఉచితాలను రద్దు చేయాలి. ఈసీ అధికారాలపై గల పరిమితులను తొలగించాలి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలి గానీ, పార్టీలకు ఓట్ల వరంగా మారకుండా చూడాలి. రాజకీయ పార్టీల భవిష్యత్తును, అధికారాన్ని నిర్ణయిస్తున్న ఈ ఉచితాల వల్ల సానుకూల, వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి. సరైన ప్రణాళికతో ఉత్పాదకతను పెంచేలా పథకాలు ఉంటే ఆర్థిక అభివృద్ధికి దోహదకారి అవుతాయి. ఎంపిక చేసిన వస్తు సేవల ఉత్పత్తి పెరగటం, ఆదాయ అసమానతలు తగ్గటం, దీర్ఘకాలికంగా శ్రామిక శక్తి ఉత్పాదకత పెరగటం జరుగుతుంది. ప్రజలు పేదరికం నుంచి బయటపడడం, ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం, మధ్యతరగతి వర్గాలు మిగిలిన డబ్బును పొదుపుకు మళ్ళించడం, దినసరి కూలీలకు భద్రత సమకూరటం, వృద్ధులు అసహాయులకు అపన్నహస్తం అందించటం, విద్య, వైద్య సదుపాయాల కల్పన వల్ల జీవన ప్రమాణం పెరిగి మానవ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల వ్యక్తిగత ఆదాయాలు పెరిగి వస్తు వినియోగ సంస్కృతి పెరగటం, డిమాండ్‌ సప్లై చైన్లు పెరగటం, ఆదాయ వృద్ధి వల్ల స్థూల దేశీయ ఉత్పత్తి పెరగటం సంక్షేమ పథకాల ఉద్దేశమై ఉండాలి. కానీ ఇవాళ సంక్షేమమంటే ‘ఓటు పథకం’గా మార్చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *