గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది
రెండు గంటల పాటు మౌన దీక్షకు కూర్చున్న జనసేనాని పవన్ కళ్యాణ్.
విజయవాడ: అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైకాపా నేతలు దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో రెండు గంటల పాటు పవన్ మౌన దీక్షకు కూర్చున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలి. జనసేన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందరులో చేసుకుందాం. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. జగన్ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన సరికాదు. జగన్పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. జగన్ ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించాను. గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం చంపేసింది. రాజకీయాల్లో బురద పడుతుందని తెలుసు.. అయినా ముందుకే సాగుతాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.