విజయవాడ, అక్టోబరు 1: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. వాటి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులను.. పౌరులను భాగస్వామ్యం చేయకుండా సచివాలయాల వ్యవస్థ రూపుదిద్దుకోవడం స్థానిక స్వపరిపాలనకు ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడమేనని కాగ్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధతపై ఇప్పటికీ స్పష్టత లేదు. కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో అధికారాల్ని సర్పంచ్ లు, కార్యదర్శుల నుంచి వీర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టి వేసింది. మహిళా పోలీసుల అంశంపైనా వ్యతిరేక తీర్పులు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు కూడా చట్టబద్ధత కల్పించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు అత్యవసరమైనందున దీనిని తీసుకొచ్చినట్లు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ కాలపరిమితి తీరింది. కానీ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించలేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లు ఆమోదిస్తే.. మొదటికే మోసం వస్తుంది. అందుకే చట్టబద్దత లేని వ్యవస్థలను అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వీటిపై రాజ్యాంగ పరిశీలన జరిగే ప్రమాదం ఏర్పడటంతో.. అందులో ఉన్న ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా అని ఆందోళన చెందుతున్నారు.