కడప, మార్చి 15: వైఎస్‌ వివేకా హత్య కేసులో హంతకులు ఎవరో కాదని.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్థంతి సందర్భంగా కడపలో శుక్రవారం నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ‘అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు. చిన్నాన్న వైఎస్‌ వివేకా మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ హత్య చేసిన, చేయించిన వారికి శిక్ష పడలేదు. చిన్నాన్న చివరి క్షణం వరకూ వైసీపీ కోసమే పని చేశారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తారా.?. సాక్షిలో పైన వైఎస్‌ ఫోటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వంపై నిందలు వేశారు. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి. విూ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో విూకు తెలియదా.? ఆయన వారసుడిగా విూరేం చేశారు. ఇది ఆస్తి, అంతస్తు కోసం జరుగుతున్న పోరాటం కాదు. న్యాయం కోసం పోరాటం. ప్రజలంతా ఓ నిర్ణయం తీసుకోవాలి.’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.’వైఎస్‌ వివేకా ఒక మంచి మనిషి. వివేకాది అద్భుతమైన వ్యక్తిత్వం. సునీత నేను కలిసే పెరిగాం. చిన్నాన్న నన్ను ఆఖరిగా కలిసినప్పుడు ఎంపీగా పోటీ చేయాలని అడిగారు. నేను వద్దన్నా వినకుండా.. నన్ను ఒప్పంచి మరీ వెళ్లారు. ఆయన చనిపోయి 5 ఏళ్లు గడిరచింది. ఆయన మరణం ఇప్పటికీ నమ్మలేని నిజం. రాజకీయ విష సర్పాల కోరల్లో చిక్కుకుని… దుర్మార్గపు పాలన చక్రాల కింద నలిగి.. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఓ నిప్పులాంటి నిజం. వివేకా హత్య కేసులో నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. అంతటి వ్యక్తికే న్యాయం జరగలేదంటే, సమాజంలో మిగతా వారి పరిస్థితి ఏంటి.?. అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణ గా ఉన్నాడు. అందుకే న్యాయం జరగలేదు. తోడబుట్టిన చెల్లెళ్లు అని చూడకుండా అవమానాలకు గురి చేసినా తట్టుకున్నాం. సునీత కుటుంబం హత్య చేసి ఉంటే విూరు ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు.?. డాక్టర్‌ గా సునీతకు ఓ స్థానం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ పేరు ఉంది. సునీతకు, చిన్నమ్మ కి మాట ఇస్తున్నా. ఎవరు ఉన్నా లేకున్నా… వైఎస్సార్‌ బిడ్డ విూకు అండగా ఉంది. సునీత పోరాటానికి నేను బలం అవుతా. ఇది ఆస్తి, అంతస్తు కోసం కాదు. న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఓ బిడ్డ కోసం పోరాటం. ప్రజలంతా న్యాయం పక్షాన నిలబడాలని ఓ నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలను ఛీ కొట్టి ఓ గుణపాఠం చెప్పాలి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *