విజయవాడ, మార్చి 1:చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అక్టోబర్‌ ` డిసెంబర్‌ ` 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని అన్నారు. ‘పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నాం. ఇప్పుడు రూ.708.68 కోట్లు ఖాతాల్లో జమ చేస్తాం. జగనన్న విద్యా దీవెనతో ఇప్పటివరకూ రూ.12,610 కోట్లు అందించాం. వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఇప్పటివరకూ రూ.18 వేల కోట్లు వెచ్చించాం. ఎన్నడూ లేని విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం.’ అని జగన్‌ వివరించారు.పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని.. అందుకే విద్యా రంగం అభివృద్ధికి ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. నాడు ` నేడుతో స్కూళ్ల రూపురేఖలే మార్చేశామని చెప్పారు. ‘మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం తీసుకొచ్చాం. విద్యార్థులకు ట్యాబ్స్‌ అందుబాటులోకి తెచ్చి డిజిటల్‌ పద్ధతిలో వారు పాఠ్యాంశాలు, కోర్సులు నేర్చుకునేలా చర్యలు చేపట్టాం. 57 నెలల కాలంగా జగన్నాథ రథ చక్రాలు ముందుకు సాగుతున్నాయి.’ అని పేర్కొన్నారు.ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ విూడియం తీసుకొస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. విద్యార్థులకు మంచి చేయడం కోసం వారితో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. ‘వారి పిల్లలు ఇంగ్లీష్‌ విూడియంలోనే చదవాలి. మన పిల్లలు చదవొద్దా.?. తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు. పిల్లలకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ ప్రచారం చేస్తున్నారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి. చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నించారా.? పేద విద్యార్థుల కోసం ఆయన చేసిన మంచి ఏంటి.?. ఆయన ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా.?. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేట్‌ విద్యా సంస్థల కోసమే’ అంటూ జగన్‌ ధ్వజమెత్తారు.ప్రసంగం అనంతరం సీఎం జగన్‌ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌, ఇతర నేతలు, కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్టీ   శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు భారీగా సభకు తరలివచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *