హైదరాబాద్, ఫిబ్రవరి 28: : సమాజంలో భద్రత లేదు. చివరికి తల్లి కడుపులో కూడా రక్షణ లేదు. ఇలా అయితే ఆడపిల్లల పరిస్థితి ఏంటమ్మా.. కార్తికేయ సినిమాలో నిఖిల్ పలికిన డైలాగ్ ఇది. అచ్చం ఆ డైలాగ్ లాగే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వారసుడు, ఇంటికి రక్షకుడు, ఇంకా రకరకాల మెరిట్స్ తో మగ పిల్లలు మాత్రమే కావాలనుకునే తల్లిదండ్రుల వల్ల.. ఆడపిల్లలు పుట్టడం లేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిల్లల జననాల్లో 78% మగ పిల్లలు ఉండడం విశేషం. పెద్దపల్లి జిల్లాలో నమోదయిన జననాల్లో 69 శాతం అబ్బాయిలే పుట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్జాగా జరుగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ వ్యత్యాసం ఇలాగే ఉంటే యువకులకు భవిష్యత్తులో పెళ్లిళ్లు అవడం కష్టమే.ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ `బర్త్ పోర్టల్ గణాంకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం జనవరిలో జన్మించిన పిల్లల్లో 52 శాతం మగ పిల్లలే ఉన్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 9,986 జననాలు నమోదయ్యాయి. ఇందులో 5,181 మంది అబ్బాయిలు పుట్టారు. 4,805 మంది అమ్మాయిలు జన్మించారు. ఇంతటి వ్యత్యాసం సమాజానికి మంచిది కాదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమాజంలో మగ పిల్లల సంఖ్య అధికంగా ఉంది. ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలున్నారు.. దీనివల్ల చాలామంది యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదు. దీంతో వారు పెళ్లి కానీ ప్రసాదు ల్లాగానే మిగిలిపోతున్నారు.ప్రణాళిక సంఘం గణాంకాల ప్రకారం బాలల లింగ నిష్పత్తికి సంబంధించి వెయ్యి మంది బాలురకు 932 బాలికలు ఉన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 999 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 970 మంది స్త్రీలున్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ ఈ బర్త్ పోర్టల్ జనవరి లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నమోదైన జననాల ప్రకారం 78 శాతం మంది అబ్బాయిలే జన్మించారు. అత్యంత మారుమూల జిల్లా అయిన ములుగులో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా జన్మించడం విశేషం. పెద్దపల్లి జిల్లాలో అబ్బాయిల జననాల రేటు ఎక్కువగా ఉంది. మహబూబాబాద్ లో 60%, నల్లగొండ లో 56%, సూర్యాపేట లో 55%, ఆదిలాబాద్, మేడ్చల్ లో 54 %, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో 53% అబ్బాయిలే పుట్టారు. ములుగు జిల్లాతో పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో మగ పిల్లల కంటే అమ్మాయిల జననాలే ఎక్కువగా నమోదయ్యాయి.ఇక రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఆడపిల్లల జననాల శాతం అధికంగా నమోదయింది. జయశంకర్ భూపాలపల్లి 62 %, నిర్మల్ 54.2%, వికారాబాద్ 53%, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం 52%, జగిత్యాల 51%, రాజన్న సిరిసిల్ల 51.55% గా ఆడపిల్లల జననాలు ఉండడం విశేషం. ఏడు జిల్లాల్లో నాలుగు జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నవే. అయినప్పటికీ అక్కడ ఆడపిల్లల జనాలు అధికంగా ఉండడానికి ప్రధాన కారణం ఆసుపత్రులు తక్కువగా ఉండటం. మిగతా ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉండడం, లింగ నిర్ధారణ కేంద్రాలు అడ్డగోలుగా గర్భస్రావాలు చేయడం వల్ల ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యత్యాసం ఇలానే కొనసాగితే రెండు దశాబ్దాల తర్వాత యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టమని పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.