చిన్నమండెం, సెప్టెంబర్ 29: స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారమే.. మండల స్థాయి “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్,జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి లు తెలిపారు.

శుక్రవారం ఉదయం చిన్నమండెం ఏఆర్ కళ్యాణ మండపం ఆవరణంలో… జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ అధ్యక్షతన మండల స్థాయిలో “జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ది అందిస్తోందన్నారు. గ్రామస్థాయిలో చిన్న చిన్న అంశాలు ఏవైనా జిల్లా అధికారుల దృష్టికి రానివి.. జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధ, శుక్రవారం నాడు ఒక్కొక్క మండల కేంద్రంలో “జగనన్నకు చెబుదాం” మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, మండల అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ప్రజలకు అవసరమైన అన్ని సేవలు సులభంగా అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. అంతేకాక మండల స్థాయిలో వచ్చిన స్థానిక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపే అవకాశం ఉందని, సచివాలయాల పరిధిలో కూడా ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మండల స్థాయి స్పందన కార్యక్రమంలో తెలియజేయవచ్చునున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్,జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి, డిఆర్ఓ సత్యనారాయణ , రాయచోటి ఆర్డిఓ రంగస్వామి లు అర్జీలు స్వీకరించి… పరిష్కారం కొరకు వాటిని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఎండార్స్ చేసి సత్వరం పరిష్కరించాలని కలెక్టరు ఆదేశించారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన కొన్ని విజ్ఞప్తులు

1. చిన్నమండెం మండలం పొలిమేర పల్లెకు చెందిన ఎల్లమ్మ…. తన దగ్గర బంధువులు తనకి తెలియకుండా తన భూమి రికార్డులను మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. తన భూమిని ఎవరి పేరు మీద మార్పు చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి అర్జీ సమర్పించారు.

2. చిన్నమండెం మండలం పొలిమేర పల్లెకు చెందిన రమణయ్య… తన పేరు మీద ఉన్న భూమిని అనధికారికంగా వేరే పేరు మీదకు మార్చుకున్నారని…. రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా కలెక్టరు గారికి అర్జీ సమర్పించారు.

3. దేవరవాండ్ల పల్లెకు చెందిన వెంకటరామిరెడ్డి… తమ పల్లెలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉందని, నూతన భవనాన్ని మంజూరు చేస్తే గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని, నూతన భవనాన్ని మంజూరు చేయించవలసిందిగా కలెక్టర్ గారికి అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మొత్తంగా 97 దరఖాస్తులు అందాయి. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా కాల పరిమితిలోపు నాణ్యతగా పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి, డిఆర్ఓ సత్యనారాయణ , రాయచోటి ఆర్డిఓ రంగస్వామి, తహసిల్దార్ శ్రీనివాసులు నాయక్, ఎంపిడిఒ సురేష్ బాబు,సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి,వైసీపీ నాయకుడు బాబు రెడ్డి, నజీర్ ఆహామధు,మండల జెసి ఎస్ ఇంచార్జ్ అంజనప్ప, చిన్నమండెం సర్పంచ్ అమీరాభి,లక్ష్మీ రెడ్డి,లోకేశ్వర్ రెడ్డి,జగన్నాథ్ రెడ్డి,ఆఫ్రోజ్, ముసల్ రెడ్డి,దామోదర్,రమణ,ఎంపీటీసీలు ఎజాష్ అలీ ఖాన్,శ్యామ్, వెంకటప్ప నాయుడు, రమణ,వైసీపీ నాయకులు యహియా ఖాన్,బురన్ ఖాన్,జహీర్,భాస్కర్ రెడ్డి,శివ,కృష్ణ రెడ్డి,రమణ రెడ్డి,రామంజులు రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *