స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి
– దేశభక్తి జీవన విధానం కావాలి
-సంబేపల్లి హైస్కూల్లో మేరీ మట్టి- మేరా దేశ్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి.
ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం నాభూమి-నాదేశం (మేరీ మట్టి- మేరా దేశ్) కార్యక్రమాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శంకరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రార్థన సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి దేశం యొక్క ఐక్యత కోసం సంఘీభావం ప్రకటించుటకు నిరంతరం కృషి చేస్తానని పంచ్ ప్రాన్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొదట ఒక కలశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులు గుప్పెడు మట్టిని వేశారు.
ఆ కలశంపై మేరీ మట్టి- మేరా దేశ్ అని వ్రాసి విద్యార్థులందరూ జాతీయ నాయకుల చిత్రపటాలని ప్రదర్శించారు. జాతీయ జెండాలు పట్టుకుని స్వతంత్ర సమరయోధుల నినాదాలు ఇస్తూ పాఠశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో దేశ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించుటకు మేరీ మట్టి- మేరా దేశ్ కార్యక్రమం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ జాతీయ నాయకులను పోలిన వేషధారణ పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.