పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్ పరీక్షలు
మార్చి 18 నుండి 30 వరకు పది పరీక్షలు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
పాడేరు:ఇంటర్మీడియేట్, పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో ఇంటర్మీడియేట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10 వతరగతికి 65 పరీక్షా కేంద్రాలు ఇంటర్మీడియేట్ 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పరీక్షలను విజయవంతం చేయాలని స్పష్టం చేసారు.
పది పరీక్షలకు 65 పరీక్షా కేంద్రాలు
పది పరీక్షలకు 65 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10,986 మంది విద్యార్దులు రెగ్యులర్ గాను, 955 మంది విద్యార్ధులు ప్రైవేటు గాను మొత్తం 11,941 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. 65 మంది చీఫ్ సూపరిండెంట్లను, 563 మంది ఇన్విజిలేటర్లను,5 ప్లైయింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందన్నారు. 22 పోలిస్ స్టేషన్లలో పరీక్షా పత్రాలను భద్రపరచాలని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసారు.
ఇంటర్ పరీక్షలకు 27 కేంద్రాలు
మార్చి 1 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసారని చెప్పారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
14611 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. జనరల్ 12054 మంది, ఒకేషనల్ 2557 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. 27 మంది పరీక్షా కేంద్రాలలో 27 మంది చీఫ్ సూపరిండెంట్లను, 610 మంది ఇన్విజిలేటర్లను రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ ను నియమించారని చెప్పారు. పరీక్షా కేంద్రాలలో తాగునీటి సదుపాయాలు, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో 144 సెక్షలను అమలు లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని నియమించి అవసరమైతే వైద్య సేవలు అందించాలని చెప్పారు. విద్యార్ధులకు రవాణా ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని ఆర్ టిసి అధికారులను ఆదేశించారు. ఎంపిడి ఓలు పరీక్షలను పర్యవేక్షించాలని, మహిళా పోలీసుల సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ధీరజ్, పరీక్షల సహాయ సంచాలకులు వినయ్ మోహనరావు, డి. ఐ. ఇ. ఓ . అప్పలరాము, డి.పి. ఓ, కొండల రావు, డి. టి. ఓ,
ఎస్. లీలా ప్రసాద్, పాడేరు సి. ఐ. డి. నవీన్ కుమార్, ఎస్టీ ఓ కృపారావు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు విభాగం సూపరిండెంట్ ఎస్. అప్పారావు, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.