గుంటూరు, ఫిబ్రవరి 13: ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వైసిపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యేలకు వారిని పరిచయం చేసింది. బి ఫారాలు సైతం అందించింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తొలుత పోటీలో ఉంటామని టిడిపి స్పష్టం చేసింది. అయితే నామినేషన్ల దాఖలు ప్రక్రియకు మరో మూడు రోజుల గడువు ఉంది. కానీ టిడిపి నుంచి ఆ స్థాయిలో సన్నాహాలు లేవు. దీంతో పోటీ నుంచి టిడిపి తప్పుకుంటుందని ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే నాలుగు దశాబ్దాల టిడిపి చరిత్రలో ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనట్టే.రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. వైసీపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టిడిపి నుంచి కనకమేడల రవీంద్ర, బిజెపి నుంచి సీఎం రమేష్‌ ల పదవీకాలం ముగియనుంది. వారి స్థానంలో ముగ్గురిని ఎంపిక చేసుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 27న పోలింగ్‌ జరగనుంది. వైసీపీ నుంచి వై వి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్‌ రెడ్డి, గొల్ల బాబూరావు పోటీ చేయనున్నారు. వారికి జగన్‌ బీఫారాలు అందించారు. నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అయితే టిడిపి పోటీ చేస్తుందా? లేదా? అన్నది మాత్రం స్పష్టత లేదు.సంఖ్యా బలంపరంగా వైసీపీకి మూడు స్థానాలు దక్కనున్నాయి. అయితే వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాలు గల్లంతయ్యాయి. దాదాపు 70 చోట్ల అభ్యర్థులను మార్చడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. వారంతా వైసిపి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టిడిపి భావించింది. ప్రస్తుతం శాసనసభలో టిడిపి బలం 23. కానీ గంటా శ్రీనివాసరావు రాజీనామాతో ఆ బలం 22 కు పడిరది. మరోవైపు వైసీపీలోకి నలుగురు సభ్యులు ఫిరాయించారు. దీంతో టీడీపీ బలం 18కి పడిపోయింది. రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన టిడిపికి 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. బలమైన అభ్యర్థిని బరిలో దించి వైసీపీ సభ్యులను తమ వైపు తిప్పుకోవాలని టిడిపి భావించింది. కానీ ఎన్నికలు సవిూపిస్తుండడం, మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే నాలుగు దశాబ్దాల టిడిపి చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.అయితే చివరి నిమిషంలో నామినేషన్‌ దాఖలు చేసి.. వైసీపీకి టిడిపి షాక్‌ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *