చెన్నై, ఫిబ్రవరి 12:తమిళనాడులో ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఇది బయట పడిరది. నిజానికి జనవరి రెండోవారంలోనే ఈ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ…ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ స్పెయిన్‌లో వరల్డ్ ఇన్వేస్టర్స్ భేటీకి హాజరయ్యారు. ఫలితంగా…అసెంబ్లీ సమావేశాలు ఆలస్యమయ్యాయి. సోమవారం ఆర్ ఎన్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఇవి గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. కానీ…ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను పక్కన పెట్టారు ఆర్ ఎన్ రవి. ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే పూర్తి చేశారు. ప్రభుత్వం రాసిన ప్రసంగాన్ని చదవనని స్పష్టం చేసిన గవర్నర్..ప్రసంగంలో కొన్ని అభ్యంతరకర, అంగీకారయోగ్యం కాని మాటలు ఉన్నాయని తేల్చి చెప్పారు. గవర్నర్‌కి బదులుగా స్పీకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవాల్సి వచ్చింది. ఫలితంగా…మరోసారి అసెంబ్లీలో అలజడి రేగింది. ‘‘నా ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించాలని చాలా సార్లు నేనుప్రభుత్వానికి సూచించాను. కానీ వాళ్లు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని అభ్యంతకరమైన విషయాలున్నాయి. వాటితో నేను అంగీకరించలేను. అలా చదివితే నిజాయతీ లేనట్టే. అందుకే..ఇంతటితోనే నా ప్రసంగాన్ని ఆపేస్తున్నాను. ఈ సమావేశాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నానని గవర్నర్ అన్నారు.