హైదరాబాద్‌, ఫిబ్రవరి8: మగవారి చేతిలో ఆడవాళ్లు మోసపోయే రోజులు పోయి.. ఆడవాళ్ల చేతిలో మోసపోతున్న మగవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కలికాలం అంటే ఇదేనేమో. పెళ్లి చేసుకుంటామని నమ్మించడం… బుట్టలో పడిన బకరాను నిలుపునా దోచేయడం… కిలేడీల లేటెస్ట్‌ ట్రెండ్‌ ఇదే. వాళ్లు చూపే ప్రేమంతా నిజమేనేమో అని నమ్మి నిలుపుదోపిడీ ఇచ్చుకుంటున్నారు అబ్బాయిలు. నిండా మునిగిపోయాక గానీ… వారి మాయ నుంచి తేరుకోవడంలేదు. మొత్తం ఖాళీ అయ్యాక… మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. అటు ఆశించిన జీవితం… ఇటు అకౌంట్లో డబ్బు.. రెండు దూరమై… రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్‌లో తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది. పెళ్లి పేరుతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను నిలువునా ముంచేసింది లేడీ ప్రొడ్యూసర్‌. ఆమె వలలో పడి ఉన్న డబ్బంతా ఊడ్చి ఇచ్చేసి.. ఇప్పుడు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఆ అభాగ్యుడి కథేంటో ఒకసారి చూద్దాం.హైదరాబాద్‌లోని వెంకటగిరి ప్రాంతానికి చెందిన 35ఏళ్ల పుల్లంశెట్టి నాగార్జున బాబు… తెలుగు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ సినిమా షూటింగ్‌లో అతనికి మహిళా నిర్మాత పరిచయం అయ్యింది. షూటింగ్‌ మాటలు కలిపింది. అతని వివరాలు… ఆస్తిపాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌ వివరాలు అన్నీ రాబట్టుకుంది. సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత… నాగార్జున బాబుకి ఫోన్‌ చేసి రాత్రి డిన్నర్‌ కోసం ఆమె ఇంటికి ఆహ్వానించింది. డిన్నర్‌ చేస్తూ పులిహోర కలిపేసింది. తనకు పెళ్లయిందని… భర్తకు విడాకులు ఇచ్చేస్తాను మనం పెళ్లిచేసుకుందాని… చెప్పింది. దీనికి నాగార్జునబాబు కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అతన్ని మాయలో పడేసింది. అతని దగ్గర ఉన్న డబ్బంతా రాబట్టుకోవడం మొదలుపెట్టింది. మాయమాటలు చెప్పి… ముందు 18లక్షల 50వేల రూపాయల నగదు తీసుకుంది. ఆ తర్వాత మరో 10లక్షల రూపాయలను తన బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేయించుకుంది. డబ్బులన్నీ ముట్టజెప్పేశాక… ఎందుకో నాగార్జునబాబుకు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమె గురించి ఆరా తీశాడు. అసలు విషయం తెలిసి షాకయ్యారు. ఆ లేడీ ప్రొడ్యూసర్‌కి ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని నాగార్జున తెలిసింది. అయితే.. తనకు ఒకసారి మాత్రమే వివాహం అయ్యిందని.. పిల్లలు లేరని చెప్పడంతో… మోసపోయానని గ్రహించాడు నాగార్జునబాబు. పెళ్లి పేరుతో మోసం చేసి.. తన డబ్బులన్నీ కాజేసిందని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో… కిలేడీ ప్రొడ్యూసర్‌ బాగోతాలన్నీ బయటపడ్డాయి. గతంలోనూ ఆమె పలువురి మోసం చేసిందని… కేసులు పెట్టి వేధించిందని పోలీసులు గుర్తించారు. విశాఖ గాజువాక పోలీస్‌స్టేషన్‌లో భరత్‌ అనే వ్యక్తిపై, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తిపై, నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కార్తికేయ అనే వ్యక్తిపై కేసులు పెట్టిందని తెలుసుకున్నారు. ఇలా ఇంకా ఆమె బాధితులు ఎంత మంది ఉన్నారు అన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నాగార్జున… తనను కూడా బ్లాక్‌మెయిల్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *