తాడేపల్లిగూడెం:కార్మిక వ్యతిరేక , రైతు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏ.ఐ.టి.యు.సి. తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ సమావేశం కార్మికులకు విజ్ఞప్తి చేసింది.సమావేశం సిపాయిపేట భవననిర్మాణ కార్మికసంఘం కార్యాలయంలో సోమవారం జరిగింది. అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసే నాలుగు కార్మిక కోడ్ల ను రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు , కనీస పించను 12 వేల రూపాయలు ఇవ్వాలని , సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మిక, రైతుసంఘాల సంయుక్త కార్యాచరణ వేదిక పిలుపు మేరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక ,రైతు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ ఫిబ్రవరి 16 వ తేదీన జాతీయస్థాయిలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని , అనుబంధ కార్మిక సంఘాలన్నీ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.ఎ.ఐ.టి.యు.సి. ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని , వాటిని ప్రతిఘటించాలని అన్నారు.సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధి హావిూ కార్మికులకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, ఏటా రెండువందల రోజుల పని కల్పించాలని , రైతులు ఉత్పత్తి చేసే పంటలకు లాభదాయకమైన ధరలు చెల్లించాలని కోరుతూ వ్యసాయ కార్మికులు, రైతులు ఫిబ్రవరి 16 సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు.మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, భవననిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, విజయదుర్గా భవననిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి గోపిసెట్టి నాగచంద్ర రావు, అనుబంధం మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సత్తిసెట్టి అప్పలరాజు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండేల్లి జయసుధ తదితరులు మాట్లాడారు.కార్యక్రమంలో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తాడికొండ కనక మహాలక్ష్మి , యూనియన్ కార్యదర్శి అల్లం వీర వెంకటలక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మండేల్లీ సత్యనారాయణ నాయకులు అల్లం నరేంద్ర, రౌతు రాజేష్, శివశంకర్, మాదాసు సత్యనారాయణ, ఆంజనేయులు, కోడ్ సాయి బాలాజీ, ఎం. చంద్రశేఖర్,బి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.